భార‌త్‌కు మ‌రో నాలుగు రాఫేల్ విమానాలు

ఫ్రాన్స్ నుంచి మరో నాలుగు రాఫేల్ యుద్ధ విమానాలు గురువారం భారత్ కు రానున్నాయి. భారత వైమానిక దళ చీప్ మార్షల్ ఆర్.కె. ఎస్. బదౌరియా ఫ్రాన్స్‌లోని మెరిగాక్ వైమానిక శిక్షణ కేంద్రం వద్ద జెండా ఊపి వీటిని ప్రారంభించారు. ఐదురోజుల పర్యటన కోసం ఫ్రాన్స్ వెళ్లిన ఆయన.. సకాలంలో రఫేల్ విమానాలను భారత్‌కు అప్పగిస్తున్నందుకు అక్కడి అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నాలుగు రాఫేల్ విమానాలు ఫ్రాన్స్ నుంచి 8000 కి.మీ ప్ర‌యాణించి నేరుగా భార‌త్ కు చేరుకోనున్నాయి.

నాలుగు యుద్ధ విమానాల రాకతో రాఫెల్‌ రెండో స్క్వాడ్రన్‌ ఏర్పాటు మరింత వేగవంతం కానుండగా.. పశ్చిమ బెంగాల్‌లోని హసీమారా వైమానిక స్థావరంలో మోహరించనున్నారు. మొదటి స్క్వాడ్రన్‌ను అంబాలా ఏర్‌బేస్‌లో ఏర్పాటు చేశారు. ఒక్కో స్క్వాడ్రన్‌లో 18 యుద్ధ విమానాలు ఉండనున్నాయి. సుమారు రూ.58వేల కోట్ల వ్యయంతో 36 రాఫెల్‌ జెట్లను కొనుగోలు చేసుకునేందుకు భారత్‌ 2016 సెప్టెంబర్‌లో ఫ్రాన్స్‌తో ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 14 జెట్లు రాగా.. కొత్తగా వచ్చే వాటితో ఆ సంఖ్య 18కి చేరనుంది. గతేడాది జూలై 29న రాఫెల్ మొద‌టి బ్యాచ్‌ జెట్లు భార‌త్ కు చేరాయి.