కోవిడ్ వ్యాక్సిన్‌పై పుకార్లను న‌మ్మ‌కండి ఏపీ వైద్య ఆరోగ్య శాఖ సూచ‌న‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఇటీవ‌ల కాలంలో కోవిడ్ వ్యాక్సీన్ మీద కొన్ని పుకార్ల‌ను కొంత‌మంది ప్ర‌చారం చేస్తున్నారు. ఇటువంటి పుకార్ల‌ను న‌మ్మ‌వ‌ద్ద‌ని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు. కోవ్యాక్సిన్ అనేది ఉత్తేజం లేని వ్యాక్సినే తప్ప శక్తి లేనిది కాదని వ్యాఖ్యానించారు. కోవిషీల్డ్ అనేది వైరల్ వెక్టార్ వ్యాక్సినే కానీ శక్తి లేనిది కాదన్నారు. ఈ రెండు వ్యాక్సిన్లలో ఏ ఒక్కటీ కరోనా పాజిటివ్‌కు దారి తీయవని చెప్పారు. ఈ రెండు వ్యాక్సీన్ ల‌లో ఏది వేయించుకొన్నా శ‌రీరంలో ర‌క్ష‌ణ ప్ర‌క్రియ మొద‌లు అవుతుంద‌ని పేర్కొన్నారు. రెండు డోసుల‌లో టీకాను వేయించుకోవ‌టం ఉత్తమం అని అధికారులు స్ప‌ష్టం చేస్తున్నారు.

వ్యాక్సినేషన్ తరువాత ఆర్టీపీసీఆర్‌లో పాజిటివ్ నిర్ధారణ అయితే.. వారిలో కోవిడ్ వ్యాధి ఉనికి ఉందని అర్ధమన్నారు. అంతేకానీ వ్యాక్సినేషన్ కారణంగా పాజిటివ్ వచ్చినట్లు కాదని వివరించారు. వ్యాక్సినేషన్ తర్వాత జ్వరం వస్తే ఆందోళన చెందొద్దని ఆరోగ్యశాఖ అధికారులు సూచించారు. వ్యాక్సినేష‌న్ త‌ర్వాత కొద్ది మందిలో మాత్రమే ఇటువంటి ల‌క్ష‌ణాలు వ‌స్తున్నాయ‌ని పేర్కొన్నారు.