కేంద్ర నిధులతోనే తెలంగాణలో అభివృద్ధి 

కేంద్ర ప్రభుత్వ నిధులతోనే రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేసి.. అవి తామే చేసినట్టు సీఎం కేసీఆర్‌ తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు. సీఎం కేసీఆర్‌, ఆయన తనయుడి వ్యవహారం సొమ్ము కేంద్రానిది.. సోకు రాష్ట్రానిది అన్నట్టు ఉందని ఎద్దేవా చేశారు. 

వరంగల్‌ అర్బన్‌ జిల్లా హన్మకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (కేడీసీ) గ్రౌండ్‌లో  జరిగిన బహిరంగ సభలో సంజయ్‌.. కార్పొరేషన్‌ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘సీఎం కేసీఆర్‌ ఈద్‌కాచంద్‌.. అమావాస్యకో.. పున్నానికో గానీ ప్రజలకు కనిపించరు’ అని విమర్శించారు. 

మంత్రి కేటీఆర్‌ను డ్రామా రామారావు అని అభివర్ణించారు. ముఖ్యమంత్రికి ముఖం లేకనే ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల పేరుతో కొడుకును వరంగల్‌ పంపించారని అన్నారు. 

వరంగల్‌ నగరంలోని అభివృద్ధి పనులపై టీఆర్‌ఎస్‌ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తున్నదని ధ్వజమెత్తారు. కేంద్రం ఇచ్చిన నిధులతోనే వరంగల్‌లో అభివృద్ధి పనులు జరిగాయని, దీనిపై బహిరంగ చర్చకు తాను సిద్ధమేనని, తప్పని నిరూపిస్తే ఎటువంటి శిక్షకైనా తాను ఒప్పుకొంటానని సవాల్‌ విసిరారు. గ్రేటర్‌ వరంగల్‌ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురబోతోందని ధీమా వ్యక్తం చేశారు. 

వరంగల్‌కు రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఇస్తానని బీజేపీ చెప్పలేదని, ఇచ్చిన మాట ప్రకారం రైల్వే ఓవరాలింగ్‌ ఫ్యాక్టరీని మంజూరు చేసిందని చెప్పారు. 14,15 ఆర్ధిక సంఘం ద్వారా కేంద్రం రూ.420 కోట్లు ఇచ్చిందనీ, వీటితోనే అమృత్‌ పథకం, హెరిటేజ్‌ సిటీ పనులు చేసిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం.. అవి తమ నిధులేనని చెప్పుకుంటోందని మండిపడ్డారు.బీజేపీని గెలిపిస్తే వరంగల్‌ను ఓరుగల్లు జిల్లాగా పేరు మారుస్తామని ఆయన ప్రకటించారు. 

అధికార టీఆర్‌ఎస్‌ నేతలు పెద్ద ఎత్తున భూకబ్జాలకు పాల్పడుతున్నారని బండి సంజయ్‌ ఆరోపించారు. నిజాయితీ కలిగిన పోలీసు అధికారి.. భూకబ్జాలకు పాల్పడుతున్న ముగ్గురు సీఐలను సస్పెండ్‌ చేశారని, దీంతో తమ ఆటలు సాగవని  టీఆర్‌ఎస్‌  నాయకులు ఆయననను ఇక్కడి నుంచి బదిలీ చేయించారని ఆరోపించారు.