మమతకు అల్లుడే సర్వసం … మోదీకి భారతీయులందరు కుటుంభమే 

తృణమూల్ అధినేత్రి మమతకు అల్లుడే సర్వస్వమని, అయితే నరేంద్ర మోదీకి 130 కోట్ల మంది భారతీయులు కుటుంబసభ్యులని  కేంద్ర హోం మంత్రి అమిత్ షా  చెప్పారు. అల్లుడికి మాత్రమే మేలు చేసే మమతా దీదీ సర్కారు కావాలా లేక దేశవ్యాప్తంగా పేద ప్రజల సంక్షేమం కోసం పనిచేసే మోదీ ప్రభుత్వం కావాలా తేల్చుకోవాలని ఆయన ఓటర్లను కోరారు. 

పశ్చిమబెంగాల్‌ కృష్ణానగర్‌, బ్యారక్‌పూర్‌లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మమత సర్కారును చిత్తుగా ఓడించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. దీదీ సంతుష్టీకరణ రాజకీయాల వల్ల బెంగాల్‌లో మతువా వర్గీయులు వెనుకబడిపోయారని అమిత్ షా ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయగానే మతువా వర్గీయుల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. 

పదేళ్లుగా తృణమూల్ దుష్పరిపాలన కారణంగా నిరుద్యోగం పెరిగిందని, శాంతి భద్రతల పరిస్థితి ఘోరంగా మారిందని, అక్రమ చొరబాట్లు పెరిగాయని షా ఆరోపించారు. బీజేపీ మాత్రమే అక్రమ చొరబాట్లను నిరోధించగలదని స్పష్టం చేశారు. 

సీఏఏను మమత వ్యతిరేకించడం వెనుక ఓటు బ్యాంక్ రాజకీయాలున్నాయని, అయితే బీజేపీ మాత్రం ఓటుబ్యాంక్ రాజకీయాలు చేయదని, దేశ ప్రజలే తమ ఓటు బ్యాంకని షా చెప్పారు. పశ్చిమబెంగాల్‌లో దుర్గాపూజకు హై కోర్టు అనుమతి కావాలా అని షా ప్రశ్నించారు. పాఠశాలల్లో సరస్వతి పూజపై ఆంక్షలు విధించిన ప్రభుత్వాలు అవసరమా అని షా ఓటర్లను ప్రశ్నించారు. 

అక్రమ చొరబాటుదార్లు యువకుల ఉపాధి అవకాశాలపైన‌, ఆర్థిక మూలాలపైన‌ దెబ్బకొడుతున్నారని ఆయ‌న‌ మండిపడ్డారు. అక్రమ చొరబాటుదార్లను కట్టడి చేయకపోతే ప్ర‌మాదం కేవలం బెంగాల్‌కు మాత్ర‌మే కాద‌ని, దేశానికే ప్రమాదమని షా హెచ్చరించారు.

దేశంలో ఒక‌ టూరిస్ట్ లీడర్ ఉన్నారంటూ రాహుల్ గాంధీని ఉద్దేశించి అమిత్ షా వ్యాఖ్యానించారు. ‘దేశంలో ఒక‌ టూరిస్ట్ నేత ఉన్నారు. ఎన్నికలకు సంబంధించిన చాలా దశలు ముగిసిపోయాయి. 

కానీ రాహుల్ గాంధీ ఎక్కడా కనిపించడం లేదు. కేవలం ఒకే ఒక ర్యాలీ నిర్వహించారు. బీజేపీ డీఎన్ఏ గురించి ఆయ‌న‌ ప్రశ్నించారు. మా డీఎన్‌ను గురించి మీరు అడగకండి. అభివృద్ధి, జాతీయత, ఆత్మనిర్భర భారత్‌తో కూడిన డీఎన్‌ఏ మాది’ అని అమిత్ షా ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.