కొవిడ్ నుంచి కోలుకున్న ఆర్‌ఎస్ఎస్ చీఫ్

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్‌ కొవిడ్-19 నుంచి కోలుకున్నారు. దీంతో ఆయనను శుక్రవారం  ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్టు నాగ్‌పూర్‌లోని కింగ్స్ వే ఆస్పత్రి వెల్లడించింది. ఈ మేరకు ఆస్పత్రి మెడికల్ సేవల డైరెక్టర్ సుబ్రజిత్ దాస్ గుప్త ఇవాళ ఓ మెడికల్ బులిటిన్‌లో పేర్కొన్నారు.
 
 ‘‘మోహన్ భగవత్ జీ ఆస్పత్రిలో చేరి నేటికి ఎనిమిది రోజులు అవుతోంది. రక్తపోటు, నాడి, శ్వాస, ఆక్సిజనేషన్ సహా ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. రక్తపరీక్షల్లో కూడా అన్నీ సాధారణంగానే ఉండడంతో వైద్యులు ఇవాళ ఆయనను డిశ్చార్జ్ చేయాలని నిర్ణయించారు” అని తెలిపారు. 
 
ఇవాళ ఉదయం ఆయనను పరీక్షించిన డాక్టర్ రాజన్ బారోకర్,  బృందం కూడా ఆయన పరిస్థితిపై సంతృప్తి వ్యక్తం చేశారు.అయితే డిశ్చార్జ్ అనంతరం ఐదు రోజుల పాటు తన నివాసంలోనే క్వారంటైన్లో ఉండాల్సిందిగా ఆయనకు చికిత్స అందించిన వైద్యుల బృందం పేర్కొన్నట్టు దాస్ తెలిపారు. 
 
ఈ నెల 9న మోహన్ భగవత్‌కు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆయనను ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. కాగా,  కేంద్ర ప‌ర్యావ‌ర‌ణ, అట‌వీ శాఖ మంత్రి ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్‌కు క‌రోనా సోకింది. త‌న‌కు పాజిటివ్‌గా రిపోర్డు వ‌చ్చిన‌ట్లు శుక్ర‌వారం ఆయ‌న ట్వీట్ చేశారు. ఇటీవ‌ల‌ త‌న‌ను క‌లిసిన వార‌తా క‌రోనా ప‌రీక్ష చేయించుకోవాల‌ని సూచించారు.