మమత ప్రతీకార రాజకీయాలు హద్దులు దాటాయి

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ కక్ష సాధింపు రాజకీయాలు హద్దులు దాటాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు. ఆమె రాజకీయాలు కేవలం నిరసనలకు పరిమితం కావడం లేదని, కక్ష సాధింపులో ప్రమాదకర స్థాయిని దాటిపోతున్నాయని హెచ్చరించారు. 

అభివృద్ధికి అడ్డుగోడగా తయారయ్యారని ఆరోపించారు. అసన్‌సోల్‌లో శనివారం జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న శాసన సభ ఎన్నికల్లో నాలుగు దశల పోలింగ్ పూర్తయిందని, టీఎంసీ ముక్కలైపోయిందని ఎద్దేవా చేశారు.

మిగిలిన నాలుగు దశల పోలింగ్‌లో దీదీ-భైపో (మమత బెనర్జీ, ఆమె మేనల్లుడు) తుడిచిపెట్టుకుపోతారని జోస్యం చెప్పారు. ఐదో దశ పోలింగ్‌లో ఓటర్లు పెద్ద ఎత్తున కమలం గుర్తుకు ఓటు వేస్తున్నారని భరోసా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటం కోసం కమలం గుర్తుపై నొక్కుతున్నారని చెప్పారు.

రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే ప్రభుత్వం ఉండకూడదని, రాష్ట్రానికి డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అవసరమని చెప్పారు. ట్రిపుల్ తలాక్ నుంచి ముస్లిం మహిళలను కాపాడటం కోసం కేంద్ర ప్రభుత్వం ఓ చట్టాన్ని అమలు చేస్తోందని తెలిపారు. 

ఈ చట్టం పట్ల మమత బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని విమర్శించారు. దళారుల నుంచి రైతులకు విముక్తి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చట్టాలను చేసినపుడు మమత బెనర్జీ వ్యతిరేకించారని దుయ్యబట్టారు. 

అభివృద్ధి బాటలో ఓ పెద్ద గోడ మాదిరిగా మమత బెనర్జీ అడ్డుగా నిల్చున్నారని మోదీ ఆరోపించారు. గడచిన పదేళ్ళలో, దీదీ (మమత) పశ్చిమ బెంగాల్ ప్రజలకు నమ్మకద్రోహం చేశారని ఆరోపించారు.

అభివృద్ధికి అడ్డుగా పెద్ద గోడ మాదిరిగా ఆమె నిల్చున్నారన్నారు. రూ.5 లక్షల వరకు ఉచిత ఆరోగ్య సంరక్షణను కేంద్ర ప్రభుత్వం ఇస్తోందని, దీనికి ఆమె అడ్డుగోడలా మారిపోయారని చెప్పారు. శరణార్థులకు సహాయపడటానికి కేంద్ర ప్రభుత్వం చట్టాలను చేసిందని, దీనిని కూడా ఆమె వ్యతిరేకించారని తెలిపారు. 

గ‌త ప‌దేండ్లుగా మ‌మ‌త‌ అభివృద్ధి పేరుతో ప‌శ్చిమ‌బెంగాల్‌ను విధ్వంసం చేశార‌ని ఆరోపించారు. మ‌మ‌తాబెన‌ర్జి అభివృద్ధి చేయ‌డం సంగ‌తి ప‌క్క‌నబెడితే.. కేంద్రం చేయాల‌నుకున్న అభివృద్ధికి కూడా ఆమె అడ్డుగోడ‌లా నిలిచార‌ని విమ‌ర్శించారు.