పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు కరోనా

పవర్ స్టార్, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కు కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది. ఈనెల 3న తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక సందర్భంగా నిర్వహించిన  పాదయాత్ర, బహిరంగ సభల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన హైదరాబాద్ కు వచ్చారు.
 
కాసింత నలతగా ఉండడంతో ఆయన కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అయితే ఈ పరీక్షల్లో ఆయనకు నెగిటివ్ వచ్చింది. వైద్యుల సూచనల మేరకు ఆయన తన ఫాంహౌస్ లోనే హోంక్వారంటైన్ లో ఉన్నారు. స్వల్పంగా జ్వరం రావడం, ఒళ్లు నొప్పులు ఉండడంతో మళ్లీ కరోనా పరీక్షలు చేయించుకున్నారు. 
 
ఈ పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ నిర్థారణ అయింది.  దీంతో హైదరాబాద్‌లోని తన వ్యవసాయ క్షేత్రంలో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. అపోలో దవాఖాన వైద్యుల బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నది. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని పవన్‌ తెలిపారు. సంపూర్ణ ఆరోగ్యంతో త్వరలోనే అభిమానుల ముందుకు వస్తానని ఆయన పేర్కొన్నారు.
 
ఖమ్మంకు చెందిన వైరల్ వ్యాధుల నివారణ నిపుణులు, కార్డియాలజిస్టు డాక్టర్ తంగెళ్ళ సుమన్ హైదరాబాద్‌కు వచ్చి పవన్ కళ్యాణ్‌కి చికిత్స చేస్తున్నట్టు తెలిసింది. 
 
ఇప్పటికే ఇతర పరీక్షలన్నీ చేయించారనీ, ఊపిరితిత్తుల్లో కొద్దిగా నిమ్ము చేరడంతో యాంటివైరల్ మందులతో చికిత్స చేస్తున్నారని, ఆక్సిజన్ కూడా ఇస్తున్నట్లుగా సమాచారం. పవన్ కల్యాణ్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. 
 
పవన్ తో ఇటీవల సన్నిహితంగా మెలిగిన వారు, ఆయనతో కాంటాక్టులో ఉన్నవారు విధిగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని, పాజిటివ్ తేలితే , చికిత్స చేయించుకోవాలని వైద్యులు సూచించారు.