ఎన్నికల ప్రక్రియ నుంచి వాలంటీర్ల తొలగింపు 

తిరుపతి ఎంపి ఉప ఎన్నికల ప్రచార ఘట్టం పూర్తయి, శనివారమే పోలింగ్ జరుగనున్న సమయంలో అధికార పక్షంపై వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. బిజెపి, టిడిపి నేతలు ఇచ్చిన ఫిర్యాదులకు స్పందిస్తూ ఎన్నికల కమీషన్ కఠిన చర్యలకు సమాయత్తమైనది. ముఖ్యంగా వాలంటీర్లను ఎన్నికల ప్రక్రియలో ఎక్కడా పాల్గొననీయరాదని స్పష్టం చేసింది. 
 
ఎన్నికల ప్రక్రియ నుంచి వాలంటీర్లను తొలగించాలని బిజెపి నేతలు కోరారు. ఈ మేరకు గురువారం కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ (సిఇసి) సుశీల్‌ చంద్ర, ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌తో బిజెపి ఎపి అధ్యక్షులు సోము వీర్రాజు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మురళీధరన్‌, సహ ఇన్‌ఛార్జి సునీల్‌ దియోధర్‌, రాజ్యసభ ఎంపి జివిఎల్‌ నరసింహారావు ఆన్‌లైన్‌ ద్వారా సమావేశమయ్యారు. 
 
వైసిపి ఎంపి అభ్యర్థి గురుమూర్తిని పోటీకి అనర్హునిగా ప్రకటించాలని కోరారు. వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి వైసిపి తరపున ప్రచారం చేస్తున్నారని తెలిపారు. పోలీసు, రెవెన్యూ, ఇతర ప్రభుత్వ సిబ్బంది వైసిపి కార్యకర్తల్లా పని చేస్తున్నారని ఆరోపించారు. పోలింగ్‌ ఏజెంట్లను, కౌంటింగ్‌ ఏజెంట్లను బెదిరిస్తున్నారని తెలిపారు. 
 
పైగా, గురుమూర్తి అన్య మతానికి చెందిన వ్యక్తి అని, అందుకు తగిన ఆధారాలు ఉన్నాయని, వాటిని కేంద్ర ఎన్నికల కమిషన్ కు అందజేశామని , గురుమూర్తి అనర్హత అంశంపై విచారణ జరపాలని కోరామని జివీఎల్ తెలిపారు. ఎస్సీలు మతం మారితే రిజర్వేషన్ వర్తించదని కావున ఎస్సీలకు రిజర్వ్ అయిన పార్లమెంటు స్థానానికి పోటీ చేయడానికి డాక్టర్ గురుమూర్తి అనర్హుడు అంటూ పేర్కొన్నారు
 
అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో సిసిటివి కెమెరాలు పెట్టి పూర్తి పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని కోరారు. సాయుధ బలగాలను మోహరింపజేసి నిష్పక్షపాతంగా ఎన్నికలు జరపాలని కోరారు. ఎన్నికల ప్రచారం గడువు గురువారంతో ముగియడంతో, ఇప్పుడు  అందరి సృష్టి శనివారం పోలింగ్ పై పడింది. 
 
తిరుపతిలో ఉపఎన్నిక సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా టీడీపీ ఎంపీలు, బిజెపి నేతలు  చేసిన ఫిర్యాదులపై ఈసీ స్పందన చూస్తే ఈ విషయం అర్దమవుతోంది. తిరుపతి ఘటనలపై ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల అధికారి అయిన విజయానంద్‌కు ఈసీ నుంచి పలు సూచనలు అందాయి.
టీడీపీ అధినేత చంద్రబాబుపై జరిగిన రాళ్ల దాడి ఘటనపై దర్యాప్తుతో పాటు పలు కీలక చర్యల్ని ప్రకటించింది. ఇందుకోసం ప్రత్యేక పోలీసు అధికారిని నియమిస్తామని కూడా తెలిపారు. ఇప్పటికే ఈ ఘటనపై స్పందించిన రాష్ట్ర పోలీసులు.. అసలు రాళ్ల దాడే జరగలేదని, ఆధారాలే లేవని చెప్తున్న నేపథ్యంలో ఈసీ దీనిపై ప్రత్యేక దర్యాప్తు చేయిస్తామని చెప్పడం గమనార్హం.
 
వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఆ  ఆదేశాల్లో పేర్కొన్నారు. అలాగే అభ్యర్ది తరఫున ఏజెంట్లుగా కూడా ఉంచొద్దని ఆదేశించారు. ఇప్పటికే వాలంటీర్లు ప్రభుత్వం తరఫున ప్రచారం చేస్తున్నారని ఆరోపణలు వచ్చిన నేఫథ్యంలో ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.