ఉత్తరాఖండ్ హరిద్వార్‌లో జరుగుతున్న మహా కుంభమేళా విషయంపై ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. కుంభమేళా వేడుకను ఇకపై ఒక సంకేతంగా మాత్రమే చూడాలని వ్యాఖ్యానించారు. పరోక్షంగా ఇక కుంభమేళాను ముగించాలన్న ధ్వని మోదీ వ్యాఖ్యల్లో ప్రస్ఫుటంగా కనిపించింది.
ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ నిరంజనీ అకారా అధ్యక్షుడు స్వామి అవధేశానంద గిరి మహారాజ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఈ విషయాన్ని మోదీయే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
‘‘ఆచార్య మహా మండలేశ్వర్ అవధేశానంద గిరీ స్వామీజీతో నేను ఈ రోజు ఫోన్‌లో మాట్లాడాను. సాధువుల ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నా. సాధువులందరూ ప్రభుత్వానికి అన్ని రకాలుగా సహకరిస్తున్నారు. ఇందుకు సాధువులందరికీ నమఃశ్శతం” అని తెలిపారు.
ఇప్పటి వరకు కుంభమేళాలో సాధువులు రెండు సార్లు పుణ్య స్నానాలు చేశారు. ఇక కుంభమేళాలో జరిగే క్రతువులను ఒక ప్రతీకగా మాత్రమే ఉంచుదాం. ప్రతీకాత్మకంగానే జరుపుకుందాం. దీనివల్ల కరోనా సంక్షోభంపై పోరాడేందుకు బలం వస్తుందని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
అయితే ప్రధాని మోదీ చేసిన విజ్ఞప్తికి స్వామి అవధేశానంద హిందీలో స్పందించారు. ‘‘మోదీ విజ్ఞప్తిని మేం గౌరవ పురస్సరంగానే స్వీకరిస్తున్నాం. ప్రాణాలు కాపాడుకోవడం కూడా ముఖ్యమే. పవిత్ర స్నానాల కోసం పెద్ద సంఖ్యలో గుమిగూడవద్దని విజ్ఞప్తి. కోవిడ్ నియమాలను విధిగా పాటించాలని విజ్ఞప్తి’’ అంటూ స్వామి అవధేశానంద ట్వీట్ చేశారు.
కుంభమేళాలో భాగంగా జరిగే స్నానాల్లో దాదాపు చాలా వరకు షాహీ స్నానాలు ముగిశాయని, కేవలం బైరాగీలది మాత్రమే ఉందని పేర్కొన్నారు. అయితే ఆ స్నానాల్లో పాల్గొనే సాధువుల సంఖ్య చాలా తక్కువగా ఉంటుందని, వాళ్లు కూడా చాలా తక్కువ సంఖ్యలోనే పాల్గొనేందుకు నిర్ణయించినట్లు స్వామి అవదేశానంద్ గిరి తెలిపారు. పవిత్ర స్నానాలు ఆచరించే రోజుల్లో .. ఇంకా ఏప్రిల్ 21(శ్రీరామనవమి), ఏప్రిల్ 27(చైత్ర పూర్ణిమ)న జరిగే స్నానాలు మాత్రమే ఉన్నాయి.
More Stories
కోల్కతా వైద్యురాలి ఫొటోలు సోషల్ మీడియా నుండి తొలగించండి!
రైలు బోల్తా కొట్టేందుకు గ్యాస్ సిలిండర్తో ప్లాన్… ఐఎస్ కుట్ర!
ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికలకు సిద్దమవుతున్న ఎబివిపి