గాలి ద్వారా వ్యాపిస్తున్న కరోనా 

ప్రపంచాన్ని వణికిస్తోన్న కోవిడ్ మహమ్మారి గాలి ద్వారా వ్యాపిస్తున్నట్లు ఇప్పటికే కొన్ని ప్రాథమిక అధ్యయనాలు వెల్లడించాయి. మరోవైపు  దీన్ని నిర్ధారించేందుకు ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో…   కోవిడ్ -19 కి కారణమయ్యే ‘సార్స్‌-కోవ్‌-2’ (SARS-CoV-2) వైరస్… ప్రధానంగా గాలి ద్వారా వ్యాపిస్తుందని నిరూపించడానికి బలమైన ఆధారాలు ఉన్నాయని అంతర్జాతీయ నిపుణుల బృందం స్పష్టం చేసింది.

ఈ మేరకు ప్రముఖ మెడికల్ జర్నల్ ‘ది లాన్సెట్‌’లో తాజా నివేదికను  ప్రచురించింది.  అయితే,   ఆందోళనకు గురిచేస్తున్న ఈ నివేదికలను నిర్ధారించేందుకు బ్రిటన్‌, అమెరికా, కెనడాకు చెందిన ఆరుగురు నిపుణులు బృందం సన్నద్ధమైంది. చివరకు గాలి ద్వారానూ వైరస్‌ వ్యాప్తి చెందుతుందని తేల్చుతూ… పలు అంశాలను  నివేదించింది.

*  వైరస్‌ సోకిన వ్యక్తి నుంచి 53 మందికి వ్యాప్తిచెందిన ఓ ఘటనను నివేదికలో వారు ఉదహరించారు. వైరస్‌ సోకిన
వ్యక్తితో సన్నిహితంగా మెలగడం గానీ, అతను తిరిగిన ప్రదేశాలకు వెళ్లకుండా, తాకిన వస్తువులను తాకకుండానే
వారందరికీ వైరస్‌ సోకిన విషయాన్ని నిపుణుల బృందం గుర్తుచేశారు. వారందరిపై జరిపిన అధ్యయనంలోనూ ఇదే
విషయం తేలిందని వారు స్పష్టం చేశారు. గాలి ద్వారా వైరస్‌ వ్యాప్తి చెందడమే ఇలాంటి ఘటనకు కారణమని
అభిప్రాయపడ్డారు.

* బాహ్యప్రదేశాల్లో కంటే ఇండోర్‌ ప్రదేశాల్లోనే వైరస్‌ వ్యాప్తి అత్యధికంగా ఉందని నిపుణులు పేర్కొన్నారు. అయితే, ఇండోర్‌ ప్రదేశాల్లో సరైన వెంటిలేషన్‌ ఉన్నట్లయితే వైరస్‌ వ్యాప్తిని సాధ్యమైనంత వరకు తగ్గించవచ్చని సూచిస్తున్నారు. కరోనా వ్యాధి లక్షణాలు లేని వ్యక్తుల నుంచి కరోనా వైరస్‌ నిశ్శబ్దంగా వ్యాప్తి చెందుతున్న విషయాన్ని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.

*  ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో దాదాపు 40శాతం…  దగ్గు, తుమ్ము వంటి లక్షణాలు లేనివారి నుంచే
ఇతరులకు సోకుతున్నాయని అధ్యయనం చేసిన బృందం వెల్లడించింది.  ప్రపంచ వ్యాప్తంగా  వైరస్‌ వ్యాపించడానికి ఈ నిశ్శబ్ద వ్యాప్తే ఎంతో కీలకంగా మారిందని, గాలిలో వైరస్‌ వ్యాపిస్తుందనడానికి ఇది కూడా ప్రధాన కారణంగా కనిపించిందని వారు చెబుతున్నారు. ఒకరినొకరు సన్నిహితంగా మెలగకపోయినప్పటికీ…  హోటళ్లలో పక్కపక్క గదుల్లో ఉన్న వ్యక్తులకు కూడా వైరస్‌ సోకడాన్ని నిపుణులు ఉదహరించింది.

* అయితే, తొందరగా ఉపరితలంపై పడిపోయే పెద్ద బిందువుల నుంచి వైరస్‌ తేలికగా గాలిలో ఎలా ప్రసరిస్తుందనడానికి శాస్త్రవేత్తలు పూర్తిస్థాయిలో రుజువు చేయలేకపోయారు. అయినప్పటికీ డైనమిక్స్‌ ఆఫ్‌ ఫ్లుయిడ్‌ ఫ్లోస్, బ్రతికున్న వైరస్‌ను వేరుచేసి జరిపిన పలు అధ్యయనాల నివేదికలను పూర్తిగా విశ్లేషించామని పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త గ్రీన్‌హాల్గ్‌ పేర్కొన్నారు. 

* గాలిలో వైరస్ వ్యాపించడం తీవ్రమైనదని అంతర్జాతీయ నిపుణుల బృందం స్పష్టంచేసింది. వైరస్‌ సోకిన వ్యక్తి శ్వాస, ఉచ్ఛ్వాసల వల్ల వైరస్‌ గాలిలోకి వెళ్లడం.. తద్వారా ఇతరులు ఆ గాలి పీల్చినప్పుడు వైరస్ వారికి ‌సోకుతుంది. ఇదే విషయం ఇప్పటికే చాలా సందర్భాల్లోనూ రుజువైందని యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియాకు చెందిన ఏరోసల్‌ శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ కింబర్లీ ప్రాథర్‌ స్పష్టం చేశారు. 

పాటించవలసిన  జాగ్రత్తలు 

* గాలిలో వైరస్‌ వ్యాప్తి చెందకుండా సరైన వెంటిలేషన్‌ ఉండేలా చూసుకోవాలి. ఎయిర్‌ ఫిల్టర్లు ఏర్పాటు చేసుకోవాలి.
* ప్రజలు సమూహాలుగా ఏర్పడకుండా చూసుకోవాలి.
* ఇండోర్‌ ప్రాంతాల్లో తక్కువ సమయం ఉండేలా చూసుకోవాలి.
* ఇండోర్‌లో ఉన్నప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించాలి.
* సాధారణ సమయాల్లోనూ నాణ్యమైన మాస్కులు వాడాలి.
* కరోనా రోగులకు చికిత్స చేసే సమయంలో వైద్య సిబ్బంది పీపీఈ కిట్లను ధరించాలని నిపుణులు సూచిస్తున్నారు.