విదేశీ టీకాలకు ఇక సత్వర అనుమతి

విదేశీ కొవిడ్ వ్యాక్సిన్ల అత్యవసర వినియోగ ప్రక్రియలపై దరఖాస్తు చేసుకున్న మూడురోజులలోనే భారత ఔషధ నియంత్రణ మండలి నిర్ణయం తీసుకుంటుంది. దేశంలో విదేశీ టీకాల ప్రవేశానికి సంబంధించి ఇది అత్యవసరం అంతకు మించి కీలక మార్పుగా మారింది.

కేంద్ర ఔషధ నియంత్రణ ప్రామాణిక సంస్థ (సిడిఎస్‌సిఒ) సంబంధిత అంశాల గురించి పరిశీలన జరుపుతుంది. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ( డిసిజిఐ) ఆధ్వర్యంలో ఈ సంస్థ పనిచేస్తోంది. దిగుమతి లైసెన్సులు, ఓవర్సీస్ మాన్యుఫ్యాక్చరింగ్ కేంద్రం, ఉత్పత్తుల నమోదిత పత్రం గురించి దరఖాస్తు చేసుకున్న మూడురోజుల వ్యవధిలోనే అనుమతికి అవకాశం ఉంటుందని ప్రభుత్వం తెలిపింది.

దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్న దశలో ఇక్కడి టీకాల కొరత నెలకొంటోంది. ఈ దశలో విదేశీ వ్యాక్సిన్లను తెప్పించుకునే విషయం, అత్యవసర వాడకానికి అనుమతి గురించి సాధ్యమైనంత త్వరలోనే నిర్ణయం తీసుకుంటారు. ఇప్పటికే విదేశీ టీకాలకు సంబంధించి సిడిఎస్‌సిఒ సమగ్ర మార్గదర్శకాలను వెలువరించింది. 

ఏఏ విదేశీ టీకా సమగ్రమైనది? అత్యవసర ప్రాతిపదికన అనుమతి ఇవ్వడం వంటి అంశాలను ఈ గైడ్‌లైన్స్‌లో పొందుపర్చారు. వీటికి అనుగుణంగా విదేశీ టీకాలకు సంబంధించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. ఇప్పటివరకూ విదేశీ టీకాలపై ప్రభుత్వం తటపటాయింపు ధోరణిని అవలంభించింది. అయితే పరిస్థితిని సమీక్షించుకుని ఈ విధానంలో మార్పులు తలపెట్టారు.

అమెరికాలోని ఎఫ్‌డిఐ, ఐరోపా యూనియన్‌కు చెందిన ఇఎంఎ, బ్రిటన్‌లోని ఎంహెచ్‌ఆర్‌ఎ, జపాన్‌కు చెందిన పిఎండిఎ, ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర వినియోగ జాబితాలో అనుమతులు పొందిన టీకాలు ఇకపై భారత్‌లో అత్యవసర వాడకానికి ప్రభుత్వ నిర్ణయంతో వీలేర్పడింది. 

కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలతో ఈ విషయం మరింత స్పష్టం అయింది. కరోనా కేసుల ఉధృతి నేపథ్యంలో జాతీయ స్థాయిలో టీకాల నిర్వహణకు సంబంధించి నిపుణుల బృందం ఏర్పడింది. 

ఈ బృందం అన్ని అంశాలను పరిశీలించి వివిధ రకాల వ్యాక్సిన్ల వాడకానికి సంబంధించి అనుమతులను వేగవంతంగా పరిశీలించేందుకు మార్గదర్శకాలను కోరింది. వీటిని సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ రూపొందించింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచింది.