అనిల్‌ దేశ్‌ముఖ్‌ను 11 గంటలు ప్రశ్నించిన సీబీఐ

మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ను సీబీఐ బుధవారం సుమారు 11 గంటలపాటు ప్రశ్నించింది. ముంబై మాజీ పోలీస్‌ కమిషనర్‌ పరంబిర్‌ సింగ్‌ ఆయనపై చేసిన ఆరోపణలపై ఆరా తీసింది.

ముఖేష్‌ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలతో కూడిన కారు నిలిపిన కేసులో సస్పెండైన ముంబై పోలీస్‌ అధికారి సచిన్‌ వాజ్‌ను నెలకు వంద కోట్లు వసూలు చేయాలని అనిల్‌ దేశ్‌ముఖ్‌ ఆదేశించారని పరంబిర్‌ సింగ్‌ సంచలన ఆరోపణలు చేశారు. 

దీనిపై దర్యాప్తు కోసం బాంబే హైకోర్టును ఆశ్రయించగా సీబీఐ ప్రాథమిక దర్యాప్తునకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 5న హోంమంత్రి పదవికి అనిల్‌ దేశ్‌ముఖ్‌ రాజీనామా చేశారు.

కాగా, సీబీఐ రెండు రోజుల కిందట అనిల్‌ దేశ్‌ముఖ్‌కు సమన్లు చేసింది. ఈ నెల 14న తమ కార్యాలయానికి రావాలని పేర్కొంది. దీంతో బుధవారం ఉదయం పది గంటలకు ఆయన ముంబైలోని డీఆర్డీవో గెస్ట్‌ హాస్‌కు చేరుకున్నారు. 

ఎస్పీ స్థాయి అధికారులు రాత్రి 9.30 గంటల వరకు సుమారు 11 గంటలపాటు అనిల్‌ దేశ్‌ముఖ్‌ను ప్రశ్నించారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు.