తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రద్దు

రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుతున్న క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలని నిర్ణయించింది. అలాగే ఇంటర్‌ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. కరోనా తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలు రద్దైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వైరస్ తీవ్రత వేళ రాష్ట్రంలో కూడా పరీక్షలను రద్దు చేసేందుకే ప్రభుత్వం మొగ్గు చూపింది.
 
కాగా, రాష్ట్రంలో దాదాపు5.35లక్షల మంది పదోతరగతి విద్యార్థులు ఉన్నారు. వీరందరినీ కూడా పైతరగతులకు ప్రమోట్‌ చేయాలని నిర్ణయించారు.  విషయానికి సంబంధించిన దస్త్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విద్యాశాఖ మంత్రి పంపించినట్లు తెలుస్తోంది. ఈ ఫైల్‌పై ముఖ్యమంత్రి సంతకం చేసినట్లు సమాచారం. ఇక కరోనా కేసులు పెరిగిన నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలు మూతపడిన విషయం తెలిసిందే.
 
గతేడాది తరహాలోనే ఎస్సెస్సీ పరీక్షలను ఈ ఏడాది సైతం రద్దుచేశారు. పరీక్ష ఫీజు చెల్లించిన 5,21,393 మంది విద్యార్థులను పాస్‌ చేస్తున్నట్టు ప్రకటించారు. సీబీఎస్‌ఈ అనుసరిస్తున్న ఫార్ములా, ఎస్సెస్సీ బోర్డు రూపొందించిన ఆబ్జెక్టివ్‌ క్రైటీరియా ఆధారంగా గ్రేడింగ్స్‌ ప్రకటించనున్నారు. 
 
ఈ మార్కులపై సంతృప్తిలేకున్నా, అభ్యంతరాలున్నా సదరు విద్యార్థులకు ఆఫ్‌లైన్‌లో పరీక్షరాసే అవకా శం కల్పిస్తామని సర్క్యులర్‌లో తెలిపారు. పరిస్థితు లు మెరుగయ్యాకే ఈ అవకాశం ఉంటుందని స్పష్టంచేశారు. ఆబ్జెక్టివ్‌ క్రైటీరియా ఏమిటన్నదానిపై విద్యాశాఖ స్పష్టతనివ్వలేదు. ముందుగా అనుకున్నదాని ప్రకారం రాష్ట్రంలో మే 17 నుంచి 26 వరకు పదో తరగతి పరీక్షలు జరుగాల్సి ఉన్నది. కరోనా నేపథ్యంలో ఎస్సెస్సీ ప్రశ్న పత్రాలను 11 నుంచి 6కు కుదించారు.
 
మే 1- 19 వరకు జరగాల్సిన ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ వార్షిక పరీక్షలను సైతం వాయిదావేశారు. ఈ పరీక్షలపై జూన్‌ మొదటివారంలో సమీక్షించి, అప్పటి పరిస్థితులనుబట్టి పరీక్షా తేదీలను ఖరారు చేయనున్నారు. పరీక్షలకు 15 రోజుల ముందుగా షెడ్యూల్‌ విడుదలచేస్తామని చిత్రారామచంద్రన్‌ సర్క్యులర్‌లో తెలిపారు. ఇక సెకండ్‌ ఇయర్‌ విద్యార్థులకు బ్యాక్‌ల్యాగ్స్‌ ఉంటే కనీస మార్కులతో ఉత్తీర్ణులుగా ప్రకటిస్తామని పేర్కొన్నారు.