జీవీజీ కృష్ణమూర్తి ఇక లేరు

కేంద్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్‌, న్యాయ, రాజ్యాంగ కోవిదుడు, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కాలం నుంచి దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన గాలి వెంకట గోపాల కృష్ణమూర్తి(జీవీజీ కృష్ణమూర్తి) ఇక లేరు. బుధవారం ఉదయం 10 గంటల సమయంలో ఢిల్లీలోని స్వగృహంలో ఆయన తుదిశ్వాస విడిచారు. 

86 ఏళ్ల జీవీజీ కొంత కాలంగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. 1993 అక్టోబరు 1 నుంచి 1996 సెప్టెంబరు 6 వరకు ఎన్నికల కమిషనర్‌గా వ్యవహరించారు. దీనికి ముందు లా కమిషన్‌ మెంబర్‌ సెక్రటరీగా పనిచేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా టీఎన్‌ శేషన్‌ ఉన్న కాలంలో పీవీ నరసింహారావు ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌ను ప్రక్షాళన చేసింది. 

ఈక్రమంలో బహుళ సభ్య కమిషన్‌గా మార్చి జీవీజీ, ఎంఎస్‌ గిల్‌లను సభ్యులుగా నియమించింది. కల్లోల కశ్మీర్‌తో పాటు వివిధ కీలక రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించడంతో పాటు ఎన్నికల కమిషన్‌ తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయాల్లో జీవీజీ కీలక పాత్ర పోషించారు.

1996లో టీడీపీలో తలెత్తిన వివాదం నేపథ్యంలో చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీనే నిజమైన పార్టీ అని, సైకిల్‌ గుర్తుపై పోటీ చేసే అధికారం ఈ పార్టీకే ఉందని ఎన్నికల కమిషన్‌ తీసుకున్న నిర్ణయం కూడా జీవీజీ హయాంలోనే జరిగింది. రాజ్యాంగ సంస్థలైన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విప్‌ జారీ చేయరాదని జీవీజీ ప్రకటించారు.

ఎన్నికల కమిషన్‌లో మాజీ ఐఏఎస్ లతోపాటు న్యాయనిపుణులు ఉండడం వల్ల కమిషన్‌ న్యాయపరంగా పారదర్శక నిర్ణయాలు తీసుకోగలుగుతుందని జీవీజీ నిరూపించారు.

ప్రకాశం జిల్లా చీరాలలో 1935, నవంబరు 19న జన్మించిన జీవీజీ కృష్ణమూర్తి బాల్యంలోనే నేతాజీ బాలసేన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాయలసీమ కరువు నివారణ కమిటీలో ఆర్‌ఎ్‌సఎస్‌ కార్యకర్తలతో కలిసి సహాయ కార్యక్రమాలు నిర్వహించారు. ఆంధ్రా వర్సిటీలో న్యాయశాస్త్రంలో గోల్డ్‌ మెడల్‌ సాధించిన జీవీజీకి ఉస్మానియా యూనివర్సిటీలో లెక్చెరర్‌ ఉద్యోగం లభించింది.

మాజీ ముఖ్యమంత్రి రోశయ్య, మాజీ స్పీకర్‌ శివరాజ్‌ పాటిల్‌ ఉస్మానియా లా కాలేజీలో జీవీజీ విద్యార్థులు. ఉస్మానియాలో లెక్చెరర్‌గా ఉన్న కాలంలో ఆంధ్ర భూమి, దక్కన్‌ క్రానికల్‌ పత్రికల ఏర్పాటుకు కృషి చేసిన చంద్రశేఖర్‌ రెడ్డికి జీవీజీ కీలక సాయం అందించారు. ఆ పత్రికలో ఆయన వ్యాసాలు రాసేవారు.

ఆ తర్వాత ఢిల్లీ వచ్చి ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ సభ్యుడు అయ్యారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఎప్పుడు ఢిల్లీకి వచ్చినా జీవీజీ ఇంట్లోనే ఉండేవారు. జీవీజీ అడ్ర్‌సతోనే పీవీ కూడా సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ సభ్యుడయ్యారు. ఇందిరాగాంధీకి అత్యంత సన్నిహితుడుగా జీవీజీకి పేరుంది. ఆమెకు న్యాయ, రాజ్యాంగ సలహాలు ఇచ్చే జీవీజీ ఆ కాలంలో న్యాయమంత్రిత్వ శాఖలో అనేక కీలక బాధ్యతలు నిర్వహించారు.

ఐక్యరాజ్యసమితికి పార్లమెంటరీ బృందం వెళ్లినప్పుడు ఎన్‌జీ రంగా నేతృత్వం వహించగా, పార్లమెంట్‌ సభ్యుడు కానప్పటికీ ఈ బృందానికి తగిన న్యాయసలహాలు ఇచ్చేందుకు తొలి పార్లమెంటరీ ప్రతినిధి వర్గం నేతగా జీవీజీని ఇందిర పంపించారు. ఇందిరా గాంధీ జీవించినంతకాలం ఆమె జన్మదినం రోజే జీవీజీ కూడా జన్మించినందున ఆయనకు ‘బర్త్‌ డే కేక్‌’ తినిపించేవారని, మంత్రివర్గం ఏర్పాటులో జీవీజీ సలహాలను తీసుకునేవారని అంటారు.

ఇందిర అనంతరం ప్రధాని అయిన రాజీవ్‌ హయాంలో జీవీజీ ప్రాభవం తగ్గింది. రాజీవ్‌ కోరుకున్న విధంగా ఒక వ్యాపార వర్గానికి జీవీజీ అనుకూల సలహాలు ఇవ్వలేదని ప్రచారంలో ఉండేది. యూనియన్‌ కార్బైడ్‌ కేసులో  బాధితుల తరఫున పోరాడి వారికి తగిన నష్టపరిహారం అందించడంలో జీవీజీ కీలక పాత్ర పోషించారు.

ప్రకాశం పంతులు, దామోదరం సంజీవయ్య, కృష్ణమీనన్‌, పీవీ నరసింహారావు, వీవీ గిరి, జైల్‌ సింగ్‌, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, రోశయ్య నుంచి అనేకమంది రాజకీయ ప్రముఖులు, సీనియర్‌  జర్నలిస్టులు కుందూరి ఈశ్వర దత్‌, చలపతిరావు, రామశర్మ, జీకె రెడ్డి మొదలైన అనేక మంది జీవీజీకి సన్నిహితులుగా ఉండేవారు. 

ఢిల్లీలో ఏపీ భవన్‌ ముందు ప్రకాశం పంతులు విగ్రహాన్ని నెలకొల్పే విషయంలో జీవీజీ తీవ్రంగా శ్రమించారు. అదేవిధంగా దేశ రాజధానిలో తెలుగు సాంస్కృతిక వికాసానికి దోహదపడ్డారు. అనేక దక్షిణాది సామాజిక, సాంస్కృతిక సంస్థలకు జీవీజీ సలహాలు, సహకారాలు లభించేవి. ఉత్తరాదిన అఖిల భారత మేధావుల సంఘానికి కూడా జీవీజీ పాట్రన్‌గా వ్యవహరించి అనేకమంది తెలుగు ప్రముఖులను సత్కరించారు. జీవీజీ రాజనీతి, సాహిత్యం, కళలకు సంబంధించి అనేక రచనలు చేశారు.

ఆయన రాసిన ‘ఇండియన్‌ డిప్లమసీ’ గ్రంథానికి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి గజేంద్ర గడ్కర్‌ ముందుమాట రాశారు. ఈ పుస్తకాన్ని దేశ, విదేశాల్లోని అనేక యూనివర్సిటీల్లో పాఠ్య ప్రణాళికల్లో చేర్చారు. జీవీజీకి భార్య పద్మ, కుమారుడు జీవీ రావు, కుమార్తె డాక్టర్‌ రాధ బోడపాటి ఉన్నారు. ఆయన కుమారుడు జీవీ రావు సుప్రీంకోర్టులో సీనియర్‌ న్యాయవాది.