ఇస్రో శాస్త్ర‌వేత్త అరెస్ట్ పై  సీబీఐ విచార‌ణ

ఇస్రో శాస్త్ర‌వేత్త నంబీ నారాయ‌ణ‌న్‌ను గ‌తంలో గూఢ‌చ‌ర్యం కేసులో అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. ఆ అక్ర‌మ అరెస్టు కేసును సీబీఐ విచార‌ణ చేప‌ట్టాల‌ని ఇవాళ సుప్రీంకోర్టు త‌న తీర్పులో ఆదేశించింది. జ‌స్టిస్ ఏఎం ఖాన్‌విల్క‌ర్ నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం ఈ కేసులో తీర్పునిచ్చింది. 

శాస్త్ర‌వేత్త నారాయ‌ణ‌న్‌ను కేర‌ళ పోలీసులు అక్ర‌మంగా అరెస్టు చేసిన‌ట్లు సుప్రీం మాజీ జ‌డ్జి డీకే జెయిన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా తాజాగా కోర్టు ఈ తీర్పును వెలువ‌రించింది. ఇది సీరియ‌స్ అంశ‌మ‌ని, దీంట్లో లోతైన విచార‌ణ జ‌ర‌గాల‌ని కోర్టు పేర్కొన్న‌ది. 

జైన్ కమిటీ నివేదికను పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. దీనిపై సుప్రీంకోర్టు స్పందిస్తూ, కేరళ పోలీసు శాఖలోని బాధ్యతాయుతమైన అధికారులు చేసిన పనులు, మానేసిన పనులను ఈ కమిటీ గుర్తించిందని తెలిపింది. 

ఈ నివేదికను ప్రాథమిక దర్యాప్తు నివేదికగా పరిగణించాలని, తదుపరి దర్యాప్తును కొనసాగించాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి దర్యాప్తు నివేదికను మూడు నెలల్లోగా సమర్పించాలని ఆదేశించింది. ఈ నివేదిక కాస్త తీవ్రమైన విషయాన్ని సూచిస్తోందని, తగిన చర్యను తీసుకోవలసిన అవసరం ఉందని తెలిపింది. 

ఈ నివేదిక అనేక పరిస్థితులు, సంఘటనలను తెలియజేస్తోందని పేర్కొంది. వీటిపై క్షుణ్ణంగా దర్యాప్తు జరగాలని తెలిపింది. నంబి నారాయణన్ అరెస్టుకు బాధ్యులైన పోలీసు అధికారులను ఈ నివేదిక గుర్తించినట్లు తెలిపింది. 

సీబీఐ డైర‌క్ట‌ర్‌కు కోర్టు కేసు కాపీ వెళ్తుంద‌ని, చ‌ట్ట ప్ర‌కారం సీబీఐ విచార‌ణ చేప‌డుతుంద‌ని సుప్రీం తెలిపింది. ఈ కేసులో మూడు నెల‌ల్లోగా సీబీఐ త‌న నివేదిక‌ను స‌మ‌ర్పించాల‌ని ధ‌ర్మాసనం పేర్కొన్న‌ది. ఇస్రోలో నంబీ నారాయ‌ణ‌న్ సైంటిస్టుగా ప‌నిచేశారు. క్రయోజెనిక్స్ డివిజ‌న్‌లో ఇంచార్జీగా చేశారు. ర‌క్ష‌ణ ర‌హ‌స్యాల‌ను శ‌త్రు దేశాల‌కు చేర‌వేస్తున్న‌ట్లు ఆయ‌నపై 1994లో అరెస్టు చేశారు.

అఫీషియ‌ల్ సీక్రెట్స్ యాక్ట్ కింద కేర‌ళ పోలీసులు ఆయ‌న్ను అదుపులోకి తీసుకున్నారు. 1998లో ఆయ‌న నిర్దోషిగా విడుదల‌య్యారు. ఆ త‌ర్వాత అక్ర‌మ కేసులు పెట్టిన పోలీసుల‌పై ఆయ‌న కేసు ఫైల్ చేశారు.ఆయనకు రూ.50 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు గతంలో తీర్పు చెప్పింది.