ధర్మశాలలో పాక్ సెల్‌ఫోన్ సిగ్నల్స్!

భారత్‌లో మరోసారి పాక్ సెల్‌ఫోన్ సిగ్నళ్ల కలకలం రేగింది. హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో పాక్ సెల్ నెట్‌వర్క్‌ సిగ్నళ్లను తమ మొబైల్ ఫోన్లు గుర్తించాయని పర్వతారోహణకు వచ్చిన కొందరు తాజాగా పేర్కొన్నారు.
 
అక్కడ భారత్ మొబైల్ ఆపరేటర్ల సిగ్నళ్లు ఏవీ అందుబాటులో లేకపోయినప్పటికీ పాక్ సిగ్నళ్లు మాత్రం పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఆ సిగ్నళ్ల స్ట్రెంత్ అధికంగా ఉండటంతో తమ మొబైల్ ఫోన్లు వాటంతట అవే పాక్ నెట్‌వర్క్‌‌కు మారిపోయాయని, తమ ఫోన్లలో పాక్ కాలమానం ప్రకారం టైమ్ కనిపించిందని వారు వెల్లడించారు. 
 
సముద్రమట్టానికి 2600 మీటర్ల ఎత్తున ఉన్న కరేరీ సరస్సు వద్ద ఉన్న సమయంలో తాము పాక్ సిగ్నళ్లను గుర్తించామని పేర్కొన్నారు. సరిహద్దుకు 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతంలో పాక్ సిగ్నళ్లు అందడంతో ప్రస్తుతం కలకలం రేగుతోంది. 
అంతర్జాతీయ నిబంధనల ప్రకారం ఓ దేశంలోని మొబైల్ ఆపరేటర్ల సిగ్నళ్లు సరిహద్దుకు 500 మీటర్లు దాటి వెళ్లకూడదు. కానీ  పాక్ సిగ్నళ్లు మాత్రం భారత్‌లో ఏకంగా 140 కిమీల లోపలికి చొచ్చుకురావడం చర్చకు దారితీస్తోంది.
 
ఉగ్రవాద చర్యలకు చెక్ పెట్టేందుకు భారత్ సెల్ సిగ్నళ్లను అప్పుడప్పుడూ బ్లాక్ చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో..ఉగ్ర సమాచార మార్పిడికి ఆటంకం ఏర్పడుతోంది. దీన్ని అధికమించేందుకు కొన్ని ప్రాంతాల్లో పాక్ ప్రభుత్వం తమ ఆపరేటర్ల సిగ్నళ్లు అందుబాటులో ఉండేలా చూస్తుందనే వార్తలు మీడియాలో పలు మార్లు వచ్చాయి. 
 
ఇక ధర్మశాలలో పాక్ సిగ్నళ్లు ఉండటం ఇదే తొలిసారి కాదు.  2018లో పాక్ సెల్యులర్ ఆపరేట్లర్లు జాంగ్, యూఫోన్‌ కంపెనీలకు చెందిన సిగ్నళ్లు ధర్మశాలలోని మొబైల్స్‌కు అందాయి. భారత్, పాక్ సరిహద్దు సమీపంలోని ప్రాంతాల్లో పాక్ సిగ్నళ్లు అందుబాటులోకి రావడం తరచూ జరిగేదే. 
అయితే ధర్మశాలలోనూ ఈ పరిస్థితి వెలుగు చూడడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. టిబెట్ మతగురువు దలైలామా ప్రస్తుతం ధర్మశాలలో ఆశ్రయం పొందుతుండటంతో అధికార యంత్రాంగం ఈ అంశంపై దృష్టి సారించింది.