వాతావరణం పట్ల భారత దేశం చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందని, అయితే అభివృద్ధి చెందిన దేశాల ఒత్తిళ్ళకు తలొగ్గబోదని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ స్పష్టం చేశారు. అభివృద్ధి చెందే హక్కు భారత దేశానికి ఉందని, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వృద్ధి చెందే హక్కు భారత దేశంలోని పేదలకు ఉందని స్పష్టం చేశారు.
పరిస్థితులనుబట్టి భారత దేశం వ్యవహరిస్తోందని చెప్పారు. జవదేకర్ బుధవారం ఫ్రెంచ్ ఎంబసీలో ఫ్రెంచ్ విదేశాంగ మంత్రి జీన్-య్వెస్ లె డ్రియన్‌తో సమావేశమయ్యారు. అనంతరం ‘‘ఫ్రమ్ పారిస్ టు గ్లాస్‌గో : స్టెప్పింగ్ అప్ గ్లోబల్ యాక్షన్ ఆన్ క్లైమేట్ ఛేంజ్’’ ప్యానెల్ చర్చలో ఆయన మాట్లాడారు.
ఫ్రెంచ్ విదేశాంగ మంత్రి అధికారిక పర్యటన నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పారిస్ వాతావరణ ఒప్పందానికి అనుగుణంగా ప్రవర్తిస్తున్న ఏకైక జీ-20 దేశం భారత దేశమని జవదేకర్ తెలిపారు. భారత దేశం ఈ ఒప్పందం అమలుపై చేసిన వాగ్దానాల కన్నా ఎక్కువగా కృషి చేస్తున్నట్లు చెప్పారు. చాలా దేశాలు 2020కి పూర్వం చేసిన వాగ్దానాలను మర్చిపోయాయని, ఇప్పుడు 2050 గురించి మాట్లాడుతున్నాయని అన్నారు. బొగ్గును ఉపయోగించవద్దని చాలా దేశాలు చెప్తున్నాయని, అయితే బొగ్గు కన్నా తక్కువ ధరకు ప్రత్యామ్నాయం అందుబాటులోకి వస్తేనే, బొగ్గును వాడటం మానేస్తారని పేర్కొన్నారు.
ఇతరుల చర్యల వల్ల భారత దేశం ఇబ్బందులు అనుభవిస్తోందని విచారం వ్యక్తం చేశారు. అమెరికా, యూరప్, చైనా గ్రీన్ హౌస్ వాయువులను విడుదల చేస్తున్నాయని, ఫలితంగా ప్రపంచమంతా ఇబ్బందులుపడుతోందని చెప్పారు. వాతావరణంపై చర్చించేటపుడు చారిత్రక బాధ్యత చాలా ముఖ్యమని చెప్పారు.
పేద దేశాలకు వాతావరణ న్యాయం జరగాలన్న విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలన్నారు. పేద దేశాలకు ఫైనాన్స్ చేస్తామని అభివృద్ధి చెందిన దేశాలు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని సూచించారు.
More Stories
కోల్కతా వైద్యురాలి ఫొటోలు సోషల్ మీడియా నుండి తొలగించండి!
రైలు బోల్తా కొట్టేందుకు గ్యాస్ సిలిండర్తో ప్లాన్… ఐఎస్ కుట్ర!
ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికలకు సిద్దమవుతున్న ఎబివిపి