పాపికొండలు పర్యాటకానికి ప్రభుత్వం అనుమతి 

ప్రకృతి ప్రేమికులు ఒక్కసారైనా వెళ్లాలనుకునే పాపికొండలు పర్యాటకానికి రాష్ట్రప్రభుత్వం అనుమతులిచ్చింది. సుమారు ఏడాదిన్నరగా పాపికొండలు పర్యటనకు ప్రభుత్వం బ్రేక్‌ ఇచ్చిన విషయం విధితమే. దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద జరిగిన లాంచీ ప్రమాదంలో 50మందికి పైగానే జలసమాధి అయ్యారు. 

ఈ ప్రమాదంతో పాపికొండలు అంటేనే ప్రజలు భయపడ్డారు. రాష్ట్రప్రభుత్వం కూడా గోదావరిలో అన్ని మోటార్‌ బోట్లనూ నిషేధించింది. భద్రతా చర్యలు తీసుకున్న నేపథ్యంలో ఈనెల 15నుండి పర్యాటకాన్ని పున:ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది.

గతంలో రాజమహేంద్రవరం నుండి 23 బోట్లు, 5లాంచీలు, భద్రాచలం నుండి 32లాంచీలు, 4 లగ్జరీ బోట్లు నడిచేవి. కచ్చులూరు ప్రమాదం తర్వాత కాకినాడ పోర్టు అధికారులు నిర్దేశిత ప్రమాణాలు లేనికారణంగా ఇప్పటివరకూ ప్రయివేటు బోట్లకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. 

తాజాగా రాష్ట్రపర్యాటకాభివృద్ధి కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో హరిత ఏసీ లగ్జరీ బోటుకు పూర్తి అనుమతులను ఇచ్చింది. ఈ క్రమంలోనే ఈనెల 15 నుండి పాపికొండలు పర్యాటకం ప్రారంభవుతోంది.