కేర‌ళ ఉన్న‌త విద్యాశాఖ మంత్రి రాజీనామా 

కేర‌ళ ఉన్న‌త విద్యాశాఖ మంత్రి రాజీనామా 

కేర‌ళ ఉన్న‌త విద్యాశాఖ మంత్రి కేటీ జ‌లీల్ త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. కేటీ జ‌లీల్ ఒక ప్ర‌జాప్ర‌తినిధి అయిఉండి త‌న విధుల‌ను దుర్వినియోగం చేశాడ‌ని, ఉద్దేశ‌పూర్వ‌కంగానే త‌న బంధ‌వులకు ల‌బ్ధి చేకూర్చే ప‌నులు చేశాడ‌ని ఇటీవ‌ల ఆ రాష్ట్ర లోకాయుక్త నిర్ధారించారు. 

అక్ర‌మానికి పాల్ప‌డినందున ఆయ‌న మంత్రిగా కొన‌సాగ‌డానికి అర్హులు కాద‌ని, త‌క్ష‌ణ‌మే త‌న మంత్రి ప‌ద‌విగా రాజీనామా చేయాల‌ని ఆదేశించారు.

దాంతో లోకాయుక్త ఆదేశాల‌పై స్టే ఇవ్వాల‌ని కోరుతూ మంత్రి కేటీ జ‌లీల్ కేర‌ళ హైకోర్టును ఆశ్ర‌యించారు. అయితే హైకోర్టు బెంచ్ సైతం కేటీ జ‌లీల్ అక్రమానికి పాల్ప‌డ్డాడ‌నే ఆరోప‌ణ‌ల‌కు విశ్వ‌సిస్తూ అత‌నికి స్టే ఇచ్చేందుకు నిరాక‌రించింది. 

ఈ నేప‌థ్యంలో కేటీ జ‌లీల్ మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఈ మేర‌కు ఆయ‌న త‌న రాజీనామా లేఖ‌ను ముఖ్య‌మంత్రి విజ‌య‌న్‌కు పంప‌గా, ఆయ‌న దాన్ని గ‌వ‌ర్న‌ర్‌కు పంపించార‌ని కేర‌ళ సీఎంవో తెలిపింది.

ఈ విష‌యాన్ని మంత్రి కేటీ జ‌లీల్ కూడా త‌న ఫేస్‌బుక్ పోస్టు ద్వారా ధృవీక‌రించారు. కాగా, 2018 న‌వంబ‌ర్‌లో ముస్లిం యూత్ లీగ్ లీడ‌ర్ అదీబ్ చేసిన ఫిర్యాదు మేర‌కు కేటీ జ‌లాల్ అక్ర‌మాల‌పై కేర‌ళ లోకాయుక్త విచార‌ణ చేప‌ట్టారు.  అదీబ్ ఆరోప‌ణ‌లు నిజ‌మేన‌ని విచార‌ణ‌లో రుజువు కావ‌డంతో మంత్రిని ప‌ద‌వి నుంచి త‌ప్పుకోవాల‌ని ఆదేశించారు.