జ‌లియ‌న్‌వాలా బాగ్ అమ‌రుల‌కు ప్ర‌ధాని మోదీ నివాళి

జలియన్‌ వాలాబాగ్‌ మారణకాండలో అమరులైన వారికి ప్రధాని నరేంద్రమోదీ నివాళులు అర్పించారు. వారి త్యాగాలు ప్రతి భారతీయుడిలోనూ శక్తిని నింపుతాయని పేర్కొన్నారు. జ‌లియ‌న్‌వాలా బాగ్‌ నరమేధం జరిగి నేటికి స‌రిగ్గా 102 ఏండ్లు పూర్త‌యిన సందర్భంగా ఆయన ఈ మేరకు మంగళవారం ట్వీట్ చేశారు. 

‘జలియన్‌ వాలాబాగ్‌ దురంతంలో అమరులైన వారికి నా నివాళులు. వారి ధైర్యం, సాహసం, త్యాగం ప్రతి భారతీయ పౌరునిలో శక్తిని పెంపొందిస్తాయి’ అని ట్వీట్ట‌ర్లో పేర్కొన్నారు.

అదేవిధంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా ట్విట్ట‌ర్‌‌ వేదికగా జలియన్‌వాలా బాగ్‌ అమరవీరులకు నివాళి అర్పించారు. ‘అమరులకు నా నివాళులు. ఎన్నేండ్లు గడిచినా ఆ చేదు ఘటన ప్రతి ఒక్క భారతీయుడి గుండెలో మెదులుతుంటుంది. వారి త్యాగానికి దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుంది’ అని వెంకయ్య ట్వీట్‌ చేశారు.

 జలియన్‌ వాలాబాగ్‌ మారణకాండ్‌ ఏప్రిల్‌ 13, 1919లో జరిగింది. బ్రిటిష్‌ పాలకులు తెచ్చిన రౌలత్‌ చట్టానికి వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసనలు చేపట్టిన సఫియుద్దీన్‌ కిచ్లూ, సత్యపాల్‌ అనే ఇద్దరు నాయకుల్ని అరెస్టు చేశారు. వారిని విడుదల చేయాలన్న డిమాండ్‌తో వైశాఖి పర్వదినం రోజున ప్ర‌జ‌లు జలియన్‌ వాలాబాగ్‌లో భారీగా సమావేశమయ్యారు.

వారిపై జనరల్‌ డయ్యర్‌ కాల్పులకు ఆదేశించ‌డంతో బలగాలు విచక్షణారహితంగా కాల్పులు జ‌రిపాయి. ఆ కాల్పుల్లో 500 మందికిపైగా మ‌ర‌ణించినట్లు నివేదిక‌లు స్ప‌ష్టంచేస్తున్నాయి.