కరోనాపై రెండో యుద్ధం టీకా ఉత్సవ్‌

టీకా ఉత్సవ్‌ను కరోనా మహమ్మారిపై రెండో యుద్ధానికి నాందిగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. సాధ్యమైనంత ఎక్కువ మందికి టీకాలు అందించే లక్ష్యంతో ఆదివారం దేశవ్యాప్తంగా టీకా ఉత్సవ్‌ ప్రారంభమైంది. బుధవారం వరకు ఇది కొనసాగనున్నది. ఈ సందర్భంగా నాలుగు విషయాలను ప్రజలు దృష్టిలో ఉంచుకోవాలని ఒక ప్రకటనలో ప్రధాని కోరారు.

‘ప్రతి ఒక్కరు మరొకరికి టీకా వేయించాలి. ప్రతి ఒక్కరు మరొకరికి చికిత్స అందేలా చూడాలి. ప్రతి ఒక్కరు మరొకరిని రక్షించాలి. ఎవరికైనా కరోనా సోకితే చిన్న కంటైన్మెంట్‌ జోన్లను ఏర్పాటు చేయడానికి ఆయా కుటుంబాలు, చుట్టుపక్కలవారు చొరవ చూపాలి’ అని సూచించారు. వృద్ధులకు, చదువుకోని వారికి టీకా వేయించుకోవడానికి సహాయం అందించాలన్నారు. స్థోమత లేని, సమాచారం తెలియని కరోనా రోగులకు చికిత్స అందించేందుకు చేయూతనందించాలని కోరారు. ప్రజలు వ్యక్తిగత, సామాజిక పరిశుభ్రతను, నిబంధనలను పాటించాలని సూచించారు.

కాగా, ‘టీకా ఉత్సవ్‌’ ప్రారంభమైన నేపథ్యంలో కొవిడ్‌ కట్టడికి 4 సూత్రాలు పాటించాలంటూ మోదీ దేశప్రజలకు పిలుపునిచ్చారు. అవేంటంటే..

ఈచ్‌ వన్‌ వ్యాక్సినేట్‌ వన్‌.. అంటే ప్రతి ఒక్కరూ మరొకరికి టీకా వేయించడం. చాలా మంది పెద్దవాళ్లు, నిరక్షరాస్యులకు వ్యాక్సినేషన్‌ కేంద్రాలు ఎక్కడ ఉంటాయో తెలియదు. తెలిసినా వెళ్లలేకపోవచ్చు. టీకాపై అవగాహన లేకపోవచ్చు. అలాంటివారికి అవగాహన కల్పించి, టీకా వేయించుకోవడం లో సాయం చేయాలని దీని ఉద్దేశం. ప్రతి ఒక్కరూ దీన్నో బాధ్యతగా తీసుకుని తమ చుట్టుపక్కల ఉన్నవారిలో నిరక్షరాస్యులు, వృద్ధులు టీకా వేయించుకునేలా చూస్తే టీకా కార్యక్ర మం ఉద్దేశం నెరవేరుతుంది.దీంతో కేసుల సంఖ్య తగ్గుతుంది.

ఈచ్‌ వన్‌ ట్రీట్‌ వన్‌.. అంటే కరోనా బాధితులు చికిత్స చేయించుకోవడానికి సహకరించడం. కరోనాకు చికిత్స ఎక్కడ చేయించుకోవాలో తెలియనివారికి, చికిత్సా కేంద్రాలకు వెళ్లలేనివారికి సాయం చేయడం.

ఈచ్‌ వన్‌ సేవ్‌ వన్‌.. అంటే ప్రతి ఒక్కరూ కొవిడ్‌ నిబంధనలు(మాస్క్‌ ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్‌ వినియోగం వంటివి) పాటించడం ద్వారా తమను తాము కాపాడుకుంటూ ఇతరులను కాపాడడం.

సూక్ష్మ కట్టడి ప్రాంతాల ఏర్పాటుకు ముందుకు రావడం. అంటే.. ఒక ప్రాంతంలో ఒక్క కేసు వచ్చినా, దాన్ని సూక్ష్మ కట్టడి ప్రాంతంగా ప్రకటించి తగిన చర్యలు చేపట్టేలా ఆయా కుటుంబాల సభ్యులు, ఇరుగుపొరుగు వారు, సమాజం ముందుకు రావాలని ప్రధాని పిలుపునిచ్చారు. కొవిడ్‌పై పోరులో ఈ సూక్ష్మ కట్టడి ప్రాంతాలు కీలకపాత్ర పోషిస్తాయన్నారు. ‘‘సూక్ష్మ కట్టడి ప్రాంతాల గురించి మనకు ఎంత అవగాహన ఉందనే విషయంపైనే మన విజయం ఆధారపడి ఉంది. అవసరం లేనప్పుడు ఇంట్లోంచి అడు గు బయటపెట్టకుండా ఉండడంపైనే మన విజయం ఆధారపడి ఉంది. అర్హులైనవారంతా వ్యాక్సిన్‌ తీసుకోవడంపైనే మన విజయం ఆధారపడి ఉంది. మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం తదితర కొవిడ్‌ నిబంధనలు పాటించడంపైనే మన విజయం ఆధారపడి ఉంది’’అన్నారు. అర్హులైనవారంతా వ్యాక్సిన్‌ వేయించుకోవాలని.. ఇందుకు సమాజం, ప్రభుత్వం పూర్తిస్థాయిలో కృషి చేయాలని పిలుపునిచ్చారు. అంతేకాదు.. టీకా వృథాను కూడా అరికట్టాలని, ఒక్క డోసు కూడా వృథా కాకుండా చూసుకోవాలని ప్రధాని సూచించారు. ఈ నాలుగు రోజుల్లో టీకా లక్ష్యాలను వ్యక్తిగత స్థాయిలో, సమాజ స్థాయిలో, ప్రభుత్వ స్థాయిలో నిర్దేశించుకోవాలని.. ఆ లక్ష్యాలను అందుకోవడానికి అన్ని విధాలా కృషి చేయాలని పేర్కొన్నారు. ప్రజల భాగస్వామ్యంతో, అవగాహనతో, ఎవరి బాధ్యతను వారు నిర్వర్తించడం ద్వారా.. కరోనాను మరోసారి కట్టడి చేయగలమన్న పూర్తివిశ్వాసం తనకు ఉందని మోదీ స్పష్టం చేశారు.

 కాగా,  దేశంలో ఓ వైపు వ్యాక్సిన్ న్రక్రియ వేగంగా సాగుతుంటే మరో వైపు అంఏ వేగంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతోంది. దేశవ్యాప్తం గా నమోదవుతున్న కేసుల్లో 70 శాతం మహారాష్ట్ర, చత్తీస్ గఢ్, కర్నాటక, ఉత్తరప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లోనే నమోదవు తున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

దేశంలో ఒక్కరోజులో రికార్డు స్థాయిలో కొత్తగా 1,52,879 కరోనా కేసులు ఆదివారం నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం కేసులు 1,33,58,805కి పెరిగాయి. కరోనా మొదలైన తర్వాత మొదటిసారిగా యాక్టివ్‌ కేసుల సంఖ్య 11 లక్షల మార్కును దాటింది. ఇది మొత్తం కేసుల్లో 8.29 శాతంగా ఉంది. 

గతేడాది సెప్టెంబర్‌ 18న యాక్టీవ్‌ కేసులు గరిష్ఠంగా 10,17,754 ఉన్నాయి. తాజాగా ఈ రికార్డు11,08,087కు పెరిగింది. రికవరీ రేటు 90.44 శాతానికి పడిపోయింది. తాజాగా 839 మరణాలు నమోదయ్యాయి. గత ఏడాది అక్టోబర్‌ 18 తర్వాత ఇదే గరిష్ఠం. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,69,275కి చేరింది. దేశంలోని యాక్టివ్‌ కేసుల్లో 70.82 శాతం అయిదు రాష్ట్రాల్లోనే (మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్‌, కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌, కేరళ) నమోదయ్యాయి. దీనిలో ఒక్క మహారాష్ట్ర వాటాయే 48.57 శాతం ఉంది.