రెండు వేల ఏళ్లుగా చైనాలో సంస్కృత బోధన

 సంస్కృతాన్ని నేర్చుకుంటున్న వారు భారత్‌లో ఎంతమంది ఉన్నారు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టమే. ఎందుకంటే సంస్కృత భాషపై ఇష్టంతో, దాన్ని నేర్చుకోవాలని ఒక సబ్జెక్టుగా ఎంచుకునేవారు చాలా తక్కువ. 

కానీ.. పొరుగుదేశమైన చైనాలో మాత్రం భారత సంస్కృతిని తెలుసుకునేందుకు సంస్కృతాన్ని నేర్చుకునేవారు రోజురోజుకూ పెరుగుతున్నారు. ఒకటి కాదు, రెండు కాదు  2వేల సంవత్సరాలుగా ఇక్కడ సంస్కృతం నేర్చుకునే ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోంది. చైనాలో ప్రముఖ సంస్కృత విధ్వంసులు, పెకింగ్‌ విశ్వవిద్యాలయంలో బౌద్ధవిద్య విభాగం డైరెక్టర్‌ వాంగ్‌ బాంగ్‌వీ రెండు వేల సంవత్సరాలుగా భారత్ లో కన్నా తమ దేశంలో సంస్కృత భాష ఎక్కువగా ప్రాచుర్యం పొందుతున్నట్లు చెప్పారు.

సంస్కృతాన్ని నేర్చుకునేందుకు భారత సాంస్కృతిక సంబంధాల మం డలి (ఐసీసీఆర్‌) రూపొందించిన ‘లిటిల్‌ గురు’ అనే యాప్‌ను భారత రాయబార కార్యాలయంలో అధికారులు ఇటీవల ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వాంగ్‌, చైనాపై సంస్కృత భాష ప్రభావం గురించి వివరించారు.

 ‘‘క్రీస్తు శకం 4వ శతాబ్దంలో భారత్‌కు చెందిన కుమారజీవ అనే పండితుడు చైనాలో సంస్కృతాన్ని వ్యాప్తి చేశారు. చైనా జాతీయ ఉపాధ్యాయుడిగా ఆయనను చైనా గౌరవించింది. భారత పురాతన వైద్యం, హిందూమతం, బౌద్ధమతం, గణితం, ఖగోళ శాస్త్రాల్ని సంస్కృతం ద్వారానే మేం నేర్చుకోగలిగాం’’ అని ఆయన తెలిపారు.

బౌద్ధ సాహిత్యాన్ని చైనా భాషలోకి అనువదించడంతో కుమారజీవను “జాతీయ చైనా ఉపాధ్యాయుడు”గా ఇప్పటికి గౌరవిస్తున్నారు. ఆ తర్వాత చాలామంది చైనా పండితులు సంస్కృత భాష వ్యాప్తి కోసం కృషి చేశారు. సంస్కృతం బోధన పెకింగ్ యూనివర్సిటీ లో వందేళ్ల క్రితమే ప్రారంభమైనా ఈ భాషలో పరిశోధన, బోధన మాత్రం రెండు వేల సంవత్సరాలుగా జరుగుతున్నట్లు చెప్పారు. 

నేడు ప్రపంచంలో సంస్కృతంలో లోతైన అధ్యయనాలు, బోధనలు జరుగుతున్న దేశంగా చైనాను పేర్కొనవచ్చు. ముఖ్యంగా బౌద్ధమతం వైపతి తర్వాత భారత్ నుండి వచ్చిన బౌద్ధ బిక్షుల ద్వారా భారత ఇతిహాస గ్రంథాలను తమ భాషలోకి అనువదింప చేసుకున్నారు.