
తెలంగాణకు కేంద్రం నిధులు ఇవ్వడం లేదని నిత్యం కేసీఆర్, కేటీఆర్, ఇతర రాష్ట్ర మంత్రులు గగ్గోలు పెడుతున్నారు. అయితే పలు కేంద్ర ప్రయోజక పథకాలకు మీ వాటా చెల్లించి, నిధులను సద్వినియోగం చేసుకోండి అంటూ పలువురు కేంద్ర మంత్రులు స్వయంగా ముఖ్యమంత్రికి లేఖలు వ్రాసినా స్పందన కనిపించడం లేదు.
రెండేండ్లుగా తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఫసల్ బీమా ప్రీమియం కట్టకపోవడంతో రైతులకు అందాల్సిన దాదాపు రూ. 934 కోట్ల పరిహారం పెండింగ్లో పడింది. దీనిపై కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఈ నెల 5న ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుకు లేఖ వ్రాసిన ప్రయోజనం లేకపోయింది. రాష్ట్ర సర్కారు సబ్సిడీ రిలీజ్ చేయడంలో ఆలస్యం చేస్తుండటంతో రైతులకు పరిహారం ఆగిపోయిందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.
క్లెయిమ్స్ సెటిల్ కాకపోవడంతో కేంద్రానికి రైతులు ఫిర్యాదులు చేస్తున్నారని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా జోక్యం చేసుకొని వెంటనే పెండింగ్ బిల్లులను రిలీజ్ చేయాలని కేంద్ర మంత్రి కోరారు. రెండేళ్లకు సంబంధించి రూ. 467.45 కోట్ల రాష్ట్ర వాటా పెండింగ్ లో ఉందని తోమర్చె ప్పారు. కాగా, 2020–-21 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఫసల్ బీమా స్కీం నిలిపి వేసింది.
మామూలుగా ఫండ్స్, ఇతర పథకాల నిధుల కేటాయింపుల కోసం కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వాల నుంచి లేఖలు పంపించడం జరుగుతూ ఉంటుంది. కానీ తెలంగాణలో రాష్ట్రంలో మాత్రం సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ అమలు, అర్హులైన వారికి లబ్ధి అందే విషయంలో కేంద్రం నుంచే సీఎం కేసీఆర్ కు లేఖలు వస్తుండటం గమనార్హం.
పీఎం కిసాన్ అమలు విషయంలోనూ రైతుల వివరాలు సరిగ్గా ఇవ్వడం లేదని గతేడాది కేంద్రం లేఖ వ్రాసింది. ప్రధానమంత్రి అవాస్ యోజన కింద ఇచ్చే ఫండ్స్ విషయమై కూడా రాష్ట్ర సర్కారుకు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి లెటర్ రాశారు. తాము కేంద్రాన్ని చాలా అడిగామని, లేఖలు రాశామని చెప్పుకునే సీఎం, మంత్రులు.. అక్కడి నుంచి వచ్చే లేఖలపై మాత్రం మాట్లాడట్లేదు.
పంటల బీమాకు రైతులు ముందే ప్రీమియం చెల్లించగా.. వచ్చిన రైతుల సంఖ్య, విస్తీర్ణం ఆధారంగా కేంద్రం ప్రీమియం సబ్సిడీ రిలీజ్ చేసింది. కానీ రాష్ట్ర సర్కారు మాత్రం పెండింగ్ లో పెట్టింది. దీంతో అకాల వర్షాలు, వడగండ్లకు నష్టపోయిన రైతులకు అందాల్సిన రూ. 934 కోట్లు ఆగిపోయాయి.
2018–19 వానాకాలం, యాసంగి సీజన్లలో రైతులు రూ. 149 కోట్ల ప్రీమియాన్ని బీమా కంపెనీలకు చెల్లించారు. కేంద్ర, రాష్ర్టరాష్ట్ర ప్రభుత్వాల వాటా కింద రూ. 147.96 కోట్ల చొప్పున ఇవ్వాలి. 2019–20లోనూ రైతులు రూ.242.23 కోట్లను ప్రీమియం వాటాగా కట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.324.45 కోట్ల చొప్పున చెల్లించాలి.
మొత్తంగా స్టేట్ సర్కారు రూ.467.45 కోట్లు విడుదల చేస్తే లక్షల మంది రైతులకు రూ. 934 కోట్ల పరిహారం అందుతుంది. నిధులు విడుదల చేయాలని సీఎం కేసీఆర్ ను రాష్ట్ర వ్యవసాయ శాఖ 3, 4 సార్లు కోరినా స్పందన లేకుండా పోయింది. రాష్ట్రంలో ఫసల్ బీమా పథకం అమల్లోకి వచ్చిన తొలి ఏడాది 2016–17లో రైతులకు రూ. 178 కోట్లు పరిహారంగా అందింది. 2017–18లో రూ. 645 కోట్లు పరిహారం పొందారు.
అయితే బీజేపీకి రైతులు దగ్గర కావొద్దనే ఉద్దేశంతోనే ఈ పధకాన్ని రాష్ట్ర సర్కారు నిలిపేసిందని విమర్శలు వస్తున్నాయి. రైతుల కోసం ఎన్ని వేల కోట్లయినా ఖర్చు చేస్తామనే సీఎం కేసీఆర్ రూ. 467 కోట్ల ప్రీమియం విడుదల చేయకపోవడం ఏంటని రైతు సంఘాలు మండిపడుతున్నాయి.
More Stories
బంగారు లక్ష్మణ్ కు ఘనంగా నివాళులు
దళారుల చేతుల్లో మోసపోతున్న తిరుమల భక్తులు
జీవన విలువల గురించి ఆర్ఎస్ఎస్లో నేర్చుకున్నాను