త‌మ వ్యాక్సిన్లు స‌రిగా ప‌ని చేయ‌డం లేదన్న చైనా 

త‌మ వ్యాక్సిన్లు స‌రిగా ప‌ని చేయ‌డం లేదన్న చైనా 

త‌మ వ్యాక్సిన్లు స‌రిగా ప‌ని చేయ‌డం లేద‌ని, వాటిని మ‌రింత స‌మ‌ర్థంగా మార్చేందుకు వ్యాక్సిన్ల మిశ్ర‌మాన్ని త‌యారు చేయాల‌ని ప్ర‌భుత్వం భావిస్తున్న‌ట్లు చైనా అధికారి వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం. వ్యాక్సిన్లపై ఆ దేశం నుంచి ఇలాంటి ప్ర‌క‌ట‌న వెలువ‌డటం చాలా అరుదైన విష‌యం. 

చైనా వ్యాక్సిన్ల‌కు ఎక్కువ ర‌క్ష‌ణ క‌ల్పించే శ‌క్తి లేదు అని చైనా సెంట‌ర్స్ ఫ‌ర్ డిసీజ్ కంట్రోల్ డైరెక్ట‌ర్ గావో ఫు వెల్ల‌డించారు. చెంగ్డులో జ‌రిగిన ఓ కాన్ఫ‌రెన్స్‌లో ఆయ‌న ఈ వాస్త‌వాన్ని బ‌య‌ట‌పెట్ట‌డం గ‌మ‌నార్హం. భారత్ తోపాటు వివిధ దేశాలు త‌యారు చేసిన వ్యాక్సిన్ల‌పై త‌ప్పుడు ప్ర‌చారం చేస్తూ తమ వ్యాక్సిన్ల‌ను ప్ర‌మోట్ చేసుకోవ‌డానికి చైనా చాలా తంటాలు ప‌డింది. ఇప్ప‌టికే కోట్లాది వ్యాక్సిన్ల‌ను వివిధ దేశాల‌కు స‌ర‌ఫ‌రా కూడా చేసింది.

అలాంటిది ఇప్పుడు త‌మ వ్యాక్సిన్లే స‌రిగా ప‌ని చేయ‌డం లేద‌ని చైనా నోటి నుంచే రావ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. అంతేకాదు వ్యాక్సిన్ల సామ‌ర్థ్యాన్ని పెంచ‌డానికి వివిధ వ్యాక్సిన్లను క‌లిపే ఆలోచ‌న కూడా చేస్తున్న‌ట్లు గావో ఫు చెప్పారు. చైనాకు చెంది సినోవాక్ వ్యాక్సిన్ సామ‌ర్థ్యం కేవ‌లం 50 శాత‌మే అని బ్రెజిల్ చేసిన అధ్య‌య‌నంలోనూ తేలింది. అదే అమెరికాలో తయారైన ఫైజర్‌ వ్యాక్సిన్‌ 97శాతం సామర్థ్యంతో పని చేస్తోంది. 

అయినా చైనా మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కూ త‌మ వ్యాక్సిన్లు త‌ప్ప ఇత‌ర దేశాల వ్యాక్సిన్ల‌కు అనుమ‌తి ఇవ్వ‌లేదు. చైనా సాంప్ర‌దాయ విధానాలు అనుస‌రించి వ్యాక్సిన్ల‌ను త‌యారు చేసింది. అయితే తాజాగా పాశ్చాత్య దేశాల టెక్నిక్ అయిన ఎంఆర్ఎన్ఏను ఉప‌యోగించ‌నున్న‌ట్లు గావో ఫు చెప్ప‌డం గ‌మ‌నార్హం. ఈయ‌నే గ‌తంలో ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ల సామ‌ర్థ్యంపై అనుమానాలు వ్య‌క్తం చేశారు. ఈ నెల 2వ తేదీ వ‌ర‌కూ చైనాలో మొత్తం 16 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఇచ్చారు.