ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌ మావోయిస్టు మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో తుపాకులు మరోసారి గర్జించాయి. గాడం-జంగంపాల్ గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు, డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్స్‌కు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.

ఈ కాల్పుల్లో ఓ మోస్టు వాంటెడ్‌ మావోయిస్టు హతమైనట్లు పోలీసులు తెలిపారు.అతడు కాటే కల్యాణ్‌ ఏరియా కమిటీకి చెందిన నక్సలైట్‌ వెట్టి ఉంగాగా భావిస్తున్నారు. అతడిపై రూ.లక్ష రివార్డు ఉన్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు.

ఎన్‌కౌంటర్‌లో మరికొందరు మావోయిస్టులు మృతి చెంది ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనాస్థలం నుంచి ఓ 8ఎంఎం పిస్టల్‌, నాటు తుపాకీ, 2 కిలోల ఐఈడీతోపాటు ఇతర సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు బస్తర్‌ రేంజ్‌ ఐజీ పీ సుందర్‌ రాజ్‌ తెలిపారు.

ఆదివారం మధ్యాహ్నం బీజాపూర్‌ జిల్లాలో వాటర్‌ ఫిల్టర్‌ ప్లాంట్‌ నిర్మాణంలో పాలుపంచుకుంటున్న ఐదు వాహనాలను మావోయిస్టులు తగులబెట్టారు. నైమిడ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన జరిగింది.

బీజాపూర్‌ పట్టణానికి మింగాచల్‌ నది నుంచి తాగునీటిని సరఫరా చేసేందుకు నది ఒడ్డున వాటర్‌ ప్లాంట్‌ను నిర్మిస్తుండగా నక్సల్స్‌ ఈ ఘాతుకానికి ఒడిగట్టారు.