సుప్రీంకోర్ట్ లో 50 శాతం సిబ్బందికి కరోనా 

దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానంలో క‌రోనా క‌ల‌క‌లం రేపింది. సుప్రీంకోర్టులోని 50 శాతం మంది సిబ్బంది ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డ్డారు. దీంతో ఇక నుంచి కేసుల‌ను వీడియో కాన్ఫ‌రెన్సింగ్ ద్వారా ఇంటి నుంచే నిర్వ‌హించాల‌ని న్యాయ‌మూర్తులు నిర్ణ‌యించిన‌ట్లు స‌మాచారం. ప్ర‌స్తుతం కోర్టురూమ్‌ల‌తోపాటు సుప్రీంకోర్టు ఆవ‌ర‌ణ మొత్తాన్నీ శానిటైజ్ చేస్తున్నారు. కోర్టులోని అన్ని బెంచీలు ఒక గంట ఆల‌స్యంగా విచార‌ణలు మొద‌లుపెట్ట‌నున్నాయి.

భారత్లో క‌రోనా రెండో ద‌శ ఉద్ధృతంగా ఉంది. గ‌త మూడు రోజులుగా ప్రతి రోజు 1.50 లక్షలకు పైగా కేసులు నమోదు కాగా,   రోజుల్లోనే కొత్త‌గా ప‌ది ల‌క్ష‌ల కేసులు న‌మోద‌య్యాయి.  రోజువారీ కేసుల్లో ప్ర‌పంచంలోనే అత్య‌ధికంగా భారత్లోనే నమోదవుతున్నాయి.

గడచిన 24 గంటలలో దేశంలో 1,68,912 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా..కరోనాతో 904 మంది మృతి చెందారు. భారతదేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,35,27,717కు చేరుకుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 12,01,009 యాక్టివ్ కేసులు ఉండగా..కరోనా నుంచి 1,21,56,529 మంది కోలుకున్నారు. 

ముఖ్యంగా ముంబయి, ఢిల్లీ, పుణెలో 10వేలకు పైగా డైలీ కేసులు నమోదవుతున్నాయి. తమిళనాడు, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్‌లోనూ అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. తాజాగా మరో 904 మంది కొవిడ్ బారిన ప‌డి ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు దేశంలో కోవిడ్ తో మరణించిన వారి సంఖ్య 1,70,209కు చేరింది. 

గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా కరోనా వాక్సిన్ 29,33,418 మంది తీసుకున్నట్లు..కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‎లో పేర్కొంది.

తాజాగా ఛత్తీస్‌గఢ్‌లోనూ కరోనా విలయతాండవం చేస్తుండ‌టంతో అప్రమత్తమైన ప్రభుత్వం పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ముందుజాగ్ర‌త్త చ‌ర్య‌లు చేప‌ట్టింది. రాష్ట్రంలో కరోనా తీవ్రత అధికంగా ఉన్న 18 జిల్లాల్లో పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధించింది. మరోవైపు రాష్ట్రానికి వచ్చేవారు త‌ప్ప‌నిస‌రిగా కరోనా నెగిటివ్ రిపోర్టు చూపించాల‌నే నిబంధ‌న తీసుకొచ్చింది.