విదేశాల్లో విడాకులపై సుప్రీంకోర్టు ఆగ్రహం 

విదేశాల్లో విడాకులపై సుప్రీంకోర్టు ఆగ్రహం 
 
“భారత్‌లో హిందూ సంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకుని, విదేశాల్లో విడాకులు తీసుకోవడం చెల్లుతుందా?” అంటూ సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. విదేశీ కోర్టులు ఇచ్చే విడాకుల డిక్రీలకు భారతీయ కోర్టులు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని, హిందూ వివాహ చట్టం ప్రకారం జరిగిన వివాహాన్ని అదే చట్టం కింద భారతీయ కోర్టులు మాత్రమే రద్దు చేయగలవని తేల్చి చెప్పింది. 
 
జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ శ్రీచంద్రశేఖర్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసులో ఇరుపక్షాల వాదనలు విని తీర్పును రిజర్వ్ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాకు చెందిన శ్రీధర్‌రెడ్డికి 2003లో ఇక్కడ వివాహం జరిగింది. ఆ తర్వాత దంపతులిద్దరూ ఇంగ్లండ్ వెళ్లారు.భార్యతో విభేదాల వల్ల 2010లో ఏపీలోని సత్తెనపల్లి కోర్టులో శ్రీధర్ రెడ్డి విడాకుల పిటిషన్ దాఖలు చేయగా, కోర్టు దానిని కొట్టివేసింది. 
 
దాన్ని హైకోర్టులో సవాలు చేసినప్పటికీ, ఆ తర్వాత ఆ పిటిషన్‌ను ఉపసంహరించుకుని ఆయన యూకే వెళ్ళిపోయారు. 2014 జనవరి 29న ఇంగ్లండ్‌లోని కేంబ్రిడ్జి కౌంటీ కోర్టు ద్వారా విడాకుల డిక్రీ పొంది, శ్రీధర్ రెడ్డి రెండో వివాహం చేసుకున్నారు. భారతీయ కోర్టులు విడాకులు మంజూరు చేయకుండా విదేశీ కోర్టు డిక్రీతో రెండో పెళ్లి చేసుకోవడం ‘బహుభార్యత్వం’ కిందకే వస్తుందని మొదటి భార్య 2016లో ఏపీలో పిటిషన్ వేసారు. 
 
పోలీసుల చార్జిషీట్‌ను రద్దు చేయాలని శ్రీధర్ రెడ్డి ఏపీ హైకోర్టును ఆశ్రయించగా, హైకోర్టు తిరస్కరించడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్ పీకే మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది:
* భారతీయ మహిళలకు అన్యాయం జరగాలా?: “కొంతమంది భారత్‌లో పెళ్లి చేసుకుని విదేశాలకు వెళ్లి ఏవో కాగితాలు చూపించి విడాకులు పొందుతున్నారు. విదేశీ కోర్టుల డిక్రీలను ఇక్కడ ప్రామాణికంగా తీసుకుంటే.. మన దేశంలో ఉన్న భార్యకు న్యాయం చేయలేని నిస్సహాయ స్థితిలో భారతీయ న్యాయవ్యవస్థ ఉండిపోవాలా?” అని ప్రశ్నించింది.
* హిందూ వివాహ చట్టమే వర్తిస్తుంది: మన దేశంలో హిందూ వివాహ చట్టం ప్రకారం జరిగిన వివాహాన్ని కేవలం అదే చట్టంలోని నిబంధనల ప్రకారం భారత కోర్టులు మాత్రమే రద్దు చేయగలవు. విదేశీ కోర్టు తీర్పులకు భారతీయ కోర్టులు కట్టుబడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.