కుంభమేళలో వేయి మంది భక్తులకు కరోనా 

ఉత్తరాఖండ్‌లో హరిద్వార్‌లోని కుంభమేళాలో రెండు రోజుల్లో వెయ్యి మంది భక్తులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. సోమవారం 408 మంది కరోనా బారిన పడగా.. మంగళవారం 594 మందికి కొవిడ్‌ సోకింది. కుంభమేళాకు రోజూ లక్షల మంది భక్తులు తరలివస్తున్నారు. కానీ కొంత మందికే కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. 

కాగా కుంభమేళా సూపర్‌ స్ర్పెడర్‌ ఈవెంట్‌ కాదని, సోమవారం మేళాను సందర్శించిన వారిలో 53 వేల మందికి అధికారులు టెస్టులు నిర్వహించారని, వాటిలో పాజిటివ్‌ రేటు 1.5% మాత్రమేనని ఉత్తరాఖండ్‌ డీజీపీ అశోక్‌ కుమార్‌ తెలిపారు. 90 శాతం మంది భక్తులు హరిద్వార్‌లో ఉండరని, కాబట్టి వారి ద్వారా వైరస్‌ వ్యాపించే అవకాశం లేదన్నారు. రోజూ కొన్ని లక్షల మంది భక్తులు వచ్చే కుంభమేళా వంటి భారీ కార్యక్రమంలో కొవిడ్‌ నిబంధనలు పాటించేలా చూడడం సాధ్యం కాదని చెప్పారు. 

హ‌రిద్వార్‌లోని హ‌ర్‌ కీ పౌరి గంగా ఘాట్‌లో సాధువులు, భ‌క్తులు పుణ్య స్నానాలు ఆచ‌రిస్తున్నారు. అయితే కుంభ‌మేళా ఈవెంట్‌ను.. గ‌త ఏడాది ఢిల్లీలో జ‌రిగిన మ‌ర్క‌జ్‌తో పోల్చ‌వ‌ద్దు అని ఉత్త‌రాఖండ్ ముఖ్యమంత్రి  తీర‌త్ సింగ్ రావ‌త్ స్పష్టం చేశారు. కుంభ్‌, మ‌ర్క‌జ్‌ల‌కు పోలికే వ‌ద్దు అని, మ‌ర్క‌జ్ ఈవెంట్ నిర్బంధ స్థ‌లంలో జ‌రిఇంద‌ని, కానీ కుంభ‌మేళా చాలా ఓపెన్ ఏరియాలో జ‌రుగుతోంద‌ని సీఎం చెప్పారు. 

ఓ మీడియా సంస్థ‌తో ఆయ‌న మాట్లాడుతూ.. రెండు మ‌త‌ప‌ర‌మైన కార్య‌క్ర‌మాల‌ను పోల్చ‌వ‌ద్దని కోరారు. సెకండ్ వేవ్ పెర‌గ‌డానికి కుంభమేళా కార‌ణ‌మ‌న్న వాద‌న‌ల‌ను ఆయ‌న కొట్టిపారేశారు. కుంభ‌మేళాకు వ‌స్తున్న వారంతా స్వ‌దేశీయులే తెలిపారు. 

మ‌ర్క‌జ్ ఘ‌ట‌న జ‌రిగిన స‌మ‌యంలో క‌రోనా గురించి అవ‌గాహ‌న లేద‌ని, ఆ కార్య‌క్ర‌మానికి వ‌చ్చిన వాళ్లు రూముల్లోనే ఎంత కాలం నుంచి ఉన్నారో ఎవ‌రికీ తెలియ‌ద‌ని గుర్తు చేశారు. ప్ర‌స్తుత ద‌శ‌లో కోవిడ్ గురించి ప్ర‌తి ఒక్క‌రికీ అవగాహ‌న వ‌చ్చింని పేర్కొ‌న్నారు. మార్గ‌ద‌ర్శ‌కాల‌ను ప్ర‌జ‌లు పాటిస్తున్నార‌ని చెప్పారు. హ‌రిద్వార్‌లో ఇవాళ కూడా భ‌క్తులు, సాధువులు పుణ్య స్నానాలు చేశారు.