41 సెంట్రల్‌ యూనివర్సిటీలకు ఒకే పరీక్ష

సెంట్రల్‌ యూనివర్సిటీల్లో ప్రవేశాలు పొందగోరే విద్యార్థులు ఇకపై ఒక్కో వర్సిటీకి ఒక్కో ఎంట్రన్స్‌ పరీక్ష రాయాల్సిన పనిలేదు. దేశంలోని 41 కేంద్ర విశ్వవిద్యాలయాలకు కలిపి ఒకే ప్ర‌వేశ ప‌రీక్ష  ‌నిర్వహించాలని నిర్ణయించారు.  సీయూసెట్‌లో ఒకే దరఖాస్తు ఫాంతో జవహర్‌లాల్‌ నెహ్రు వర్సిటీ, బనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం, ఢిల్లీ వర్సిటీలతో సహా పలు కేంద్ర విశ్వవిద్యాలయాలకు అభ్యర్థులు ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకోవచ్చు.

2020 డిసెంబర్‌లో యూజీసీ ఏర్పాటు చేసిన ఏడుగురు సభ్యుల కమిటీ ఈ వారం ప్రారంభంలో తన నివేదికను సమర్పించింది. రాబోయే విద్యాసంవత్సరం నుండి సెంట్రల్‌ వర్సిటీల్లోని అన్ని ప్రొగ్రామ్స్‌లో ప్రవేశానికి కేంద్ర విశ్వవిద్యాలయాల కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(సీయూసెట్) ను ప్రవేశపెట్టాలని, పరీక్షను సంవత్సరానికి రెండుసార్లు నిర్వహించాలని కమిటీ సిఫార్సు చేసింది.

అయితే ఈ ఏడాది కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో ప్రవేశానికి మాత్రమే ఉంటుందని అదికూడా ఒకసారి మాత్రమే నిర్వహిస్తామని విద్యా మంత్రిత్వశాఖలోని ఉన్నత విద్యా కార్యదర్శి అమిత్‌ ఖరే తెలిపారు.  సీయూసెట్‌ నూతన జాతీయ విద్యా విధానం 2020లో భాగమన్నారు. మొట్టమొదటి సీయూసెట్‌ జూన్‌ చివరలో నిర్వహించే అవకాశం ఉందని, జులైలో ఫలితాలు ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు తెలిపారు. తద్వారా అకాడమిక్‌ సైకిల్‌ ఆలస్యం కాకుండా ఉంటుందన్నారు.

సీయూ సెట్‌ రెండు భాగాలుగా ఉంటుంది. సెక్షన్‌-ఏ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌. 50 ప్రశ్నలు. సెక్షన్‌-బి 50 ప్రశ్నలను కలిగి ఉంటుంది. హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష నిర్వహణ. 3 గంటల పాటు ఎంట్రన్స్‌ టెస్ట్‌ నిర్వహణ. 

సీయూ సెట్‌లో కనీసం 50 శాతం స్కోర్‌ చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రవేశాలకు ఈ మొత్తం స్కోర్‌ను ఉపయోగిస్తారా లేదా వేర్వేరు వెయిటేజీలు ఇస్తాయా అనేది ఆయా యూనివర్సిటీలు నిర్ణయించుకోవాల్సి ఉంటుంది.