ఏప్రిల్‌ 30 లోపు పన్ను చెల్లిస్తే ఐదుశాతం రిబేటు

ముందుగా ఆస్తి పన్నును వసూలు చేసేందుకు గాను జీహెచ్‌ఎంసీ ప్రవేశ పెట్టిన ఎర్లీ బర్డ్‌ పథకం ఆస్తి పన్ను చెల్లింపుదారులకు ఉపయోగకరంగా మారింది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా జీహెచ్‌ఎంసీ అధికారులు ఎర్లీ బర్డ్‌ పథకాన్ని ప్రవేశపెట్టారు. గతేడాది ఆస్తి పన్ను గడువు తేదీ మార్చి 31న ముగిసిన విషయం విదితమే. 

ఈ నెల ఎర్లీ బర్డ్‌ పథకాన్ని జీహెచ్‌ఎంసీ ప్రకటించింది. ముందుగా పన్ను చెల్లించే వారికి జీహెచ్‌ఎంసీ ఐదు శాతం రిబేటును ఇస్తోంది. ఏప్రిల్‌ 30 లోపు ఆస్తి పన్ను చెల్లించే వారు ఐదు శాతం తగ్గించుకుని చెల్లించేందుకు గాను అధికారులు చర్యలు తీసుకున్నారు. జీహెచ్‌ఎంసీ ప్రవేశ పెట్టిన ఈ పథకంలో భాగంగా ఆస్తి పన్ను వసూలు చేసేందుకు గాను జీహెచ్‌ఎంసీ అధికారులు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.

గడువు లోపు పన్ను చెల్లించని వారికి రెండు శాతం అపరాధ రుసుం విధిస్తున్న జీహెచ్‌ఎంసీ ముందుగా ఆస్తి పన్ను చెల్లించే వారికి రిబేటు కల్పించేందుకు గాను ఈ పథకాన్ని ప్రవేశ పెట్టింది. కొన్నేండ్లుగా ఈ ఎర్లీ బర్డ్‌ పథకం కొనసాగుతోంది. గతేడాది పద్నాల్గవ సర్కిల్‌ కార్యాలయం పరిధిలో ఈ పథకం ద్వారా పది కోట్లకు పైగా వసూలైంది. ఈ ఎర్లీ బర్డ్‌ పథకానికి ప్రజల నుంచి స్పందన లభించే అవకాశాలున్నాయి.

గత సంవత్సరం ఎర్లీ బర్డ్‌ పథకంలో భాగంగా సర్కిల్‌ కార్యాలయం పరిధిలో ఏప్రిల్‌ 30 లోపు పది కోట్ల రూపాయలకు పైగా వసూలు కాగా ఈ సంవత్సరం కూడా అదే స్థాయిలో ఆస్తి పన్ను వసూలవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

జీహెచ్‌ఎంసీ ప్రవేశ పెట్టిన ఎర్లీ బర్డ్‌ పథకంపై ప్రజలలో అవగాహన కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ముందుగా ఆస్తి పన్ను చెల్లించే వారికి ఐదు శాతం రిబేట్‌ను కల్పించే వసతిని కల్పించింది. అత్యధికులకు ఈ విషయం తెలియక పోవడంతో తెలియ చేసేందుకు గాను అధికారులు చర్యలను ప్రారంభించారు.

 సెల్‌ఫోన్‌ల ద్వారా ఎస్‌ఎంఎస్‌ పంపడం, బ్యానర్లను ఏర్పాటు చేయడం, ఆటోలకు మైకులను పెట్టి ప్రచారం చేయించి ఎర్లీ బర్డ్‌ పథకంపై అవగాహన కల్పిస్తున్నారు. కొన్నేండ్లుగా ఈ పథకాన్ని ప్రవేశ పెడుతుండడంతో ఈ మాసంలో ఆస్తి పన్ను చెల్లించి రిబేటును పొందేందుకు ముందుకు వస్తున్నారు. జీహెచ్‌ఎంసీ కార్యాలయాలలోనే కాకుండా ఆన్‌లైన్‌ ద్వారా కూడా ఆస్తి పన్ను చెల్లించేందుకు జీహెచ్‌ఎంసీ అవకాశం కల్పిస్తోంది.