జులై 8న కొత్త పార్టీ … షర్మిల ప్రకటన 

దివంగత వైవైస్ఆర్‌ జయంతి జూలై 8న తాను పెట్టబోయే కొత్త పార్టీ పేరు, జెండా, అజెండాను ప్రకటిస్తానని మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి కుమార్తె వైఎస్‌ షర్మిల  వెల్లడింఛారు.

రాష్ట్రంలో కొత్త పార్టీ పెట్టే ఏర్పాట్లలో ఉన్న షర్మిల శుక్రవారం ఖమ్మం పెవిలియన్‌ గ్రౌండ్‌లో సంకల్ప సభను నిర్వహించిన ఆమె ప్రసంగిస్తూ.. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ఆత్మగౌరవం కేసీఆర్‌ దొర కాలికింద నలిగిపోతోందని మండిపడ్డారు.  రాష్ట్రంలో ప్రశ్నించే పార్టీలు లేవని, కేవలం ప్రశ్నించడం కోసమే తాను పార్టీ పెడుతున్నట్టు ఆమె  ప్రకటించారు.

 అధికారం, పదవులు ఉన్నా లేకపోయినా.. ప్రజపక్షాన నిలిచి, వారి కోసం పోరాడి.. తిరిగి ప్రజాసంక్షేమ పాలన తీసుకొస్తానని ఆమె స్పష్టం చేశారు. అందుకు అందరూ తనను, తాను పెట్టబోయే పార్టీని ఆదరించాలని కోరారు. వైఎస్‌ సంక్షేమ రాజ్యాన్ని స్థాపించి.. అన్నివర్గాల ప్రజలకు తెలంగాణ ఫలాలను అందిద్దామన్న ఆమె.. అందుకోసం తాను సంకల్పం తీసుకుంటున్నానని చెప్పారు. 

తాను తెలంగాణ బిడ్డనని, ఈ గడ్డమీదే పుట్టానని, ఈ గడ్డమీదే చదివానని, ఇక్కడే తాను పిల్లలను కన్నానని, ఈ గడ్డ రుణం తీర్చుకుంటానంటూ ఉద్వేగంగా ప్రసంగించారు. తెలంగాణలో కేసీఆర్‌ దొర పాలన సాగుతోందని విమర్శించారు. నీళ్లు, నిధులు, నియామకాలన్నీ దొర ఇంటికే పరిమితమయ్యాయని ధ్వజమెత్తారు. 

తెలంగాణ సాధించిన ఫలాలు ప్రగతిభవన్‌ గేటు దాటడం లేదని పేర్కొంటూ  ప్రాజెక్టుల రీడిజైన్లు పేరుతో నిధులు దండుకుంటున్నారని, తల తోక తీసేసి ప్రాజెక్టులు కట్టి కమీషన్లు దోచుకుంటున్నారని ఆమె ఆరోపించారు.

ఎన్నో ఆశలు, ఆశయాలతో తెచ్చుకున్న తెలంగాణలో సీఎం కేసీఆర్‌ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని, బాంచన్‌ దొర అంటూ ప్రజలు బతుకుతున్నారన్నారు. కాంగ్రెస్‌ ప్రశ్నించే పరిస్థితిలో లేదని, పార్టీ ఎమ్మెల్యేలను కేసీఆర్‌ పార్టీకి అందించే కంపెనీగా మారిపోయిందని షర్మిల  విమర్శించారు. 

సింహం సింగిల్‌గానే వస్తుందని, తాను టీఆర్‌ఎస్‌ చెబితేనో, బీజేపీ అడిగితేనే, కాంగ్రెస్‌ పంపిస్తేనో రాలేదని ఆమె స్పష్టం చేశారు. తాను రాజన్న బిడ్డనని, ఎవరి కింద పనిచేయనని, ఎవరితోనూ పొత్తు పెట్టుకోనన్నారు. తమ పార్టీలో నేటి కార్యకర్తలే రేపటి నాయకులని ఆమె చెప్పారు.

 ‘‘షర్మిల ఇక నా బిడ్డ కాదు.. మీ బిడ్డ. ఇక్కడి చరిత్ర, సంప్రదాయాలు, సంస్కృతి, సమస్యలు, ప్రజల ఇబ్బందులన్నీ ఆమెకు తెలుసు. మీరు అన్నివిధాలా అండగా నిలుస్తూ ఆశీర్వదించండి’’ అని దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ సతీమణి విజయమ్మ ప్రజలను కోరారు. రైతులు, మహిళలు, విద్యార్థులు, పేదల ఇబ్బందులను షర్మిల గుర్తించిందని, ఆమె పెట్టే కొత్త పార్టీని నిండు మనసుతో ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.