రైతులతో మరిన్ని చర్చల‌కు ప్రభుత్వం సిద్ధం

కొత్త చ‌ట్టాల విష‌యంలో రైతుల‌తో మ‌రిన్ని చ‌ర్చ‌లు జ‌రిపేందుకు ప్ర‌భుత్వం సిద్ధంగా ఉన్న‌ద‌ని కేంద్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి న‌రేంద్ర సింగ్ తోమ‌ర్ చెప్పారు. చాలా మంది రైతు సంఘాల నేత‌లు, ఆర్థిక‌వేత్త‌లు వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు మ‌ద్ద‌తు ఇస్తున్నార‌ని, కాని కొంత‌మంది రైతుల‌కు ఈ బిల్లులు న‌ష్ట‌ప‌రిచేవిగా క‌నిపిస్తున్నాయ‌ని పేర్కొన్నారు.

నిరసన తెలుపుతున్న‌ రైతు సంఘాలతో ప్రభుత్వం 11 రౌండ్ల చర్చలు జరిపింది, మరిన్ని చర్చలు జ‌రిపేందుకు కూడా ప్ర‌భుత్వం సిద్ధంగా ఉన్న‌ద‌ని తెలిపారు.“మేము సమస్యాత్మక ప్రాంతాలను చర్చించడానికి, వాటిలో మార్పులు చేయటానికి ముందుకొచ్చాం. రైతు సంఘాలు అంగీకరించలేదు, దానికి కారణం కూడా చెప్పలేదు. ప్రభుత్వం మాట్లాడటానికి సిద్ధంగా లేనప్పుడు లేదా యూనియన్ అనుకూలమైన ప్రతిస్పందన లేనప్పుడు ఆందోళన కొనసాగుతుంది” అని తోమర్ చెప్పారు.

ప్రభుత్వం, రైతు సంఘాల మ‌ధ్య‌ 11 రౌండ్ల చర్చలు జరిగాయి. చివరిది జనవరి 22 న జ‌రిగింది. జనవరి 26 న నిరసన తెలిపిన రైతుల ద్వారా ట్రాక్టర్ ర్యాలీలో విస్తృతంగా హింస జరిగిన తరువాత చర్చలు తిరిగి ప్రారంభం కాలేదు.

మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను 18 నెలలు నిలిపివేసి, ప‌రిష్కారం కనుగొనేందుకు సంయుక్త కమిటీని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనపై యూనియన్లు స్పందిస్తున్నందున.. రైతులతో ప్రభుత్వం తిరిగి చర్చలు ప్రారంభించడానికి సిద్ధంగా ఉందని తోమర్ ఫిబ్రవరి నెలలో చెప్పారు.

“ప్రభుత్వం రైతుల పట్ల పూర్తిగా సానుకూలంగా ఉంది. మేం అనేక రౌండ్ల చర్చలు నిర్వహించాము. అనేక సవరణలను ప్రతిపాదించాం. అలాగే వ్యవసాయ సంస్కరణ చట్టాలను ఏడాదిన్న‌ర పాటు నిలిపివేసి, పరిష్కారాలను కనుగొనడానికి ఉమ్మడి ప్యానెల్ ఏర్పాటు చేయాల‌ని చేసిన ప్రతిపాదనలకు వారు స్పందించలేదు” అని తోమ‌ర్ పేర్కొన్నారు.

దేశ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ వ్యాప్తి తీవ్రంగా ఉన్నందున చిన్నారులు, మ‌హిళ‌లు సెకండ్ వేవ్‌కు గురై ఆరోగ్య స‌మ‌స్య‌లు కొనితెచ్చుకోకుండా వెంట‌నే నిర‌స‌న‌లు విర‌మించి ఇండ్ల‌కు వెళ్లిపోవాల‌ని తోమ‌ర్ విజ్ఞ‌ప్తి చేశారు.