ఫోర్జరీ, మోసం, సాక్షులు, సాక్ష్యాల్ని ట్యాంపరింగ్ చేయడం లాంటి నేరాలకు సాక్ష్యాత్తూ డీజీపీ, సీఐడీ అదనపు డీజీ, ఏసీబీ డీజీ, నిఘా విభాగం అధికారులు పాల్పడ్డారని నిఘా విభాగం మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు ఆరోపించారు. ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌కు ఆయన లేఖ రాశారు.
అంతర్వేది రథం దగ్ధం కేసును సీబీఐకి ఇచ్చినట్లే, ఈ నేరాలపైనా ఆ సంస్థతో విచారణ చేయించాలని కోరారు. ‘‘ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాశ్, నాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ, సీఐడీ ఏడీజీ, సీఐడీ డీఎస్పీలు…నా కుమారుడు పూర్తిగా నాపై ఆధారపడి ఉంటే తప్ప రూల్4(3)(ఎ) వర్తించదన్న విషయాన్ని గుర్తించడంలో విఫలమయ్యారు” అని తెలిపారు.
“ఈ అధికారులు బుర్ర పెట్టి ఆలోచించకుండా సదరు సెక్షన్‌ను నా కేసుకు వర్తింపచేయడం వల్ల ప్రభుత్వం నన్ను సస్పెండ్ చేస్తూ అక్రమంగా ఉత్తర్వులు ఇచ్చింది. ఈ దృష్ట్యా ప్రవీణ్‌ప్రకాశ్, నీలం సాహ్నిపై కూడా చర్యలు తీసుకోవాలి’’ అని తొమ్మిది పేజీల లేఖలో కోరారు.
‘‘నా నిర్ద్దోషిత్యాన్ని నిరూపించుకునేందుకు, జరిగిన తప్పులను చెప్పేందుకు నా కేసుపై నియమించిన విచారణ కమిషన్‌ను బహిరంగంగా, మీడియా ముందే విచారణ చేయాలని కోరాను. కానీ నా అభ్యర్థనను తిరస్కరించారు. అనంతరం ఈ ఏడాది మార్చి 18వ తేదీన నా కేసులో విచారణ ప్రారంభమైంది” అని తెలిపారు.
“ఆ మరునాటి ఉదయమే విజయవాడ, హైదరాబాద్‌లోని నా నివాసాల్లో సోదాలు చేశారు. ఒక ల్యాప్‌టాప్, డెస్క్ టాప్ సీజ్ చేశారు. విచారణ కమిషన్ ముందు విచారణకోసం నేను సిద్ధం చేసుకున్న నోట్సు, ప్రశ్నలు అన్నీ వాటిలోనే ఉన్నాయి. మరికొన్ని డాక్యుమెంట్లను కూడా వాళ్లు సీజ్ చేశారు’ అని వివరించారు. ఇన్ని చేసినా విచారణ కమిషన్ ముందు మార్చి 22నుంచి ఏప్రిల్ 4వ తేదీవరకు జరిగిన విచారణలో పాల్గొని…అన్ని విషయాలను ఆన్‌రికార్డ్‌గా సమర్పించాను. ఇరువైపుల వాదనలు ముగిశాక ఈ నెల ఏడో తేదీన ప్రాసిక్యూషన్ తన వాదనలను రాతపూర్వకంగా కమిషన్ ముందు సమర్పించింది.
ఇలా సమర్పించిన డాక్యుమెంట్లు, అంతకుముందు హైకోర్టు, సుప్రీంకోర్టు, క్యాట్‌లలో ప్రాసిక్యూషన్ (ప్రభుత్వం) సమర్పించిన పత్రాలన్నీ పరిశీలిస్తే…అందులో జరిగిన నేరాలు అర్థమయ్యాయి. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్నవారంతా సీనియర్ అధికారులు, కీలక పదవుల్లో ఉన్నవారే. అందుకే విచారణ న్యాయబద్ధంగా, సకాలంలో జరిగేందుకు వారిని అదే పోస్టుల్లో కొనసాగించే అంశంపై పునరాలోచించాలని కోరారు.
More Stories
నేడే శ్రీవారి బ్రహ్మోత్సవ అంకురార్పణం
పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష విరమణ
అమరావతికి ప్రపంచ బ్యాంకు తొలివిడతలో రూ.3750 కోట్లు