జగన్ కు తిరుపతిలో ఎన్నికల భయం!

తిరుపతి లోక్ సభ కు జరుగుతున్న ఉపఎన్నికలలో తమ పార్టీకి తిరుగులేని విజయం లభిస్తుందని మొదటి నుండి ధీమాతో ఉన్న ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి తాజాగా గెలుపు భయం పట్టుకొందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. 

మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో అధికార పార్టీకి చెందిన వారే ఎమ్యెల్యేలుగా ఉన్నప్పటికీ వారిలో ఇద్దరు అసలు పార్టీ వైపు చూడక పోవడం ఒక కారణం కాగా, జగన్ పాలనలో హిందూ దేవాలయాలపై అంతులేకుండా జరుగుతున్న దాడుల పట్ల ప్రజాగ్రహానికి తిరుపతి కేంద్రంగా నిలబడటం మరో కారణంగా కనిపిస్తున్నది. 

తిరుపతి ఉప ఎన్నికల ప్రచారానికి తాను రావాల్సిన అవసరం లేదని చెప్పిన జగన్ ఈ నెల 14న వస్తున్నట్లు ప్రకటించడమే అధికార పక్షంలో నెలకొన్న ఆందోళనను వెల్లడి చేస్తున్నది. స్థానిక సంస్థల ఎన్నికలలో ఏకపక్షంగా తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకున్న భరోసా ఇప్పుడు అధికార పక్షంలో కనబడటం లేదు. ఒకరు కాదు ఇద్ధరు కాదు ఏకంగా ఏడుగురు మంత్రులను ఒకేసారి ఒక్కోక్క అసెంబ్లీ నియోజకవర్గానికి ఇన్ చార్జ్ లుగా దింపారు. 

అర్ధాంతరంగా రమణ దీక్షితులుకు పాత పదవిని కట్టబెట్టి,ఆయనతో జగన్ ను విష్ణుమూర్తి అవతారంగా పొడిగించుకోవడం వెనుక కూడా ఉపఎన్నికలో లబ్ది పొందే ఎత్తుగడ కనిపిస్తున్నది. అంతేకాదు, జగన్ బాబాయి, టిటిడి ట్రస్ట్ బోర్డు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి , కొంతమంది అర్చక స్వాముల చేత జగన్ ను, వైసిపిని పొగిడితే జాబులు పర్మినెంట్ చేస్తామని లేదంటే ఉద్యోగం తీసేస్తామని బెదిరించి పొడిగించుకొంటున్నట్లు ఆరోపణలు తలెత్తుతున్నాయి. 

యువతకు జాబ్ నోటిఫికేషన్లు లేక, ఉధ్యోగాలు లేక నరకయాతన పడుతున్న యువకుల సమస్యలను, సంక్షేమం పేరుతో వందలకోట్లను కొట్టేసిన అవినీతిని, రెండు  ఏళ్ళ నుంచి రోడ్లు వేయకుండా, మురికికాలువలు పొంగి డ్రైనేజి సమస్యతో, ధోమల వలన జబ్బుల పెరగడం, కరెంట్ తీగలు నేలకు తాకడం వంటి నిర్లష్యం వంటి స్థానిక సమస్యలను ప్రచార ఆయుధాలుగా మారే ప్రమాదం లేకపోలేదని అధికార పక్ష నేతలు ఖంగారు పడుతున్నారు. 

ఇలా ఉండగా, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భయపడే తిరుపతి ఉపఎన్నికల ప్రచారానికి వస్తున్నారని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ విమర్శించారు.  తిరుపతిలో బీజేపీ ప్రచారం ఉత్సాహంగా సాగుతోందని పేర్కొంటూ  ఒకసారి మోదీకి అవకాశం ఇవ్వాలని తిరుపతి ప్రజలు అనుకుంటున్నారని తెలిపారు. వైసీపీకి, టీడీపీకి ఓటు వేసినా ఉపయోగంలేదని ప్రజలు భావిస్తున్నారని, తిరుపతిలో బీజేపీ విజయం ఖాయమని కన్నా లక్ష్మీ నారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు.

కాగా,  శ్రీవారికి సేవలందించాల్సిన ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు సీఎంను మహావిష్ణువుతో పోల్చుతూ చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌ కోరారు. మానవులను దేవుళ్లతో పోల్చడం భావ్యం కాదని హితవు చెప్పారు.