ఎపిలో కరోనా వైరస్‌ కల్లోలం

ఆంధ్ర ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా వైరస్‌ కల్లోలం కొనసాగుతోంది. రోజురోజుకూ కరోనా రోగుల సంఖ్య పెరుగుతోంది. నెల క్రితం వరకు కేసులు పదుల్లో ఉండగా.. గత మూడు, నాలుగు వారాలుగా వేలల్లో నమోదవ్వడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం విడుదల చేసిన బులిటెన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో 31,268 శాంపిల్స్‌ పరీక్షించగా మరో 2,558 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్‌ కేసుల సంఖ్య 9,15,832కు చేరింది. 

గడచిన 24 గంటల్లో ఆరుగురు చనిపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 7,268కి చేరింది. అదే సమయంలో 915 మంది కోలుకున్నారు. దీంతో కరోనా నుంచి ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 8,89,651కు చేరింది. మరో 14,913 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

గత 24 గంటల్లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 465 కేసులు నమోదయ్యాయి. ఆ తరువాత గుంటూరు జిల్లాలో 399, కర్నూలు జిల్లాలో 344, విశాఖ జిల్లాలో 290, నెల్లూరు జిల్లాలో 204, శ్రీకాకుళం జిల్లాలో 185, ప్రకాశం జిల్లాలో 153, కృష్ణా జిల్లాలో 152, అనంతపురం జిల్లాలో 131, కడప జిల్లాలో 94, తూర్పు గోదావరి జిల్లాలో 58, విజయనగరం జిల్లాలో 46, పశ్చిమగోదావరి జిల్లాలో 37 కేసులు నమోదయ్యాయి.

ఇప్పటి వరకు రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లా 1,25,587 పాజిటివ్‌ కేసులతో మొదటి స్థానంలో ఉండగా.. ఆ తర్వాత స్థానంలో పశ్చిమగోదావరి జిల్లా 94,663 కేసులు, చిత్తూరు జిల్లా 92,205 కేసులు, గుంటూరు జిల్లా 80,525 కేసులు, అనంతపురం జిల్లా 69,031, నెల్లూరు జిల్లా 64,398, విశాఖపట్నం జిల్లా 63,577 కేసులతో వరుసగా ఉన్నాయి. మరణాల సంఖ్య మాత్రం తక్కువగానే ఉంది.

కాగా, రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఏపీకి  అదనంగా కోటి డోసుల కోవిడ్‌ వ్యాక్సిన్‌ను కేంద్ర ప్రభుత్వం అందించనుంది. నిర్దిష్ట అర్హతలున్న ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్రానికి తెలిపింది.

ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులతో పాటు గ్రామ,వార్డు సచివాలయాల పరిధిలోనూ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభించినందున కోటి డోసులు పంపాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు మార్చి 26న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌కు లేఖ రాశారు.