పరిషత్‌ పోరుకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌!

ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు అడ్డంకి తొలగిపోయింది. పరిషత్‌ ఎన్నికల షెడ్యూల్‌కు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఈ నెల 1న జారీ చేసిన నోటిఫికేషన్‌లో తదుపరి చర్యలన్నీ నిలిపివేస్తూ సింగిల్‌ జడ్జి మంగళవారం జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను తాజాగా హైకోర్టు ధర్మాసనం రద్దు చేసింది. షెడ్యూల్‌ ప్రకారం ఈ ఎన్నికల నిర్వహణకు అనుమతినిచ్చింది.

అయితే సింగిల్‌ జడ్జి వద్ద ఉన్న రిట్‌ పిటిషన్‌ పరిష్కారం అయ్యేవరకు ఓట్ల లెక్కింపు చేపట్టవద్దని ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. అదేవిధంగా ఫలితాలను కూడా ప్రకటించవద్దని స్పష్టం చేసింది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయిన తరుణంలో ఎన్నికలను నిలిపివేయడం సరికాదని ధర్మాసనం అభిప్రాయపడింది.

ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ అరూప్‌కుమార్‌ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్‌ చాగరి ప్రవీణ్‌ కుమార్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అప్పీల్‌ను పరిష్కరిస్తున్నట్లు పేర్కొన్న ధర్మాసనం.. సింగిల్‌ జడ్జి ముందున్న రిట్‌ పిటిషన్‌ ఏ రోజైతే విచారణకు ఉందో ఆ రోజు విచారణకు వచ్చేలా చూడాలని రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది.

అత్యవసరంగా హౌస్‌మోషన్‌ దాఖలు చేయడం వల్ల సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పోలింగ్‌ తేదీకి నాలుగు వారాల ముందు ఎన్నికల కోడ్‌ విధించలేదన్న పిటిషనర్‌ వ్యాజ్యంలో పూర్తి స్థాయి అఫిడవిట్‌ దాఖలు చేయలేకపోయామని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) చెబుతున్నందున.. ఈ వ్యవహారంలో లోతైన విచారణ జరిపి వివాదాస్పద అంశాలను తేల్చాల్సి ఉందని అభిప్రాయపడింది. 

ఈ నేపథ్యంలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య వేసిన వ్యాజ్యం ఈ నెల 15న సింగిల్‌ జడ్జి ముందు విచారణకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని హైకోర్టు రిజిస్ట్రీని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అరూప్‌ కుమార్‌ గోస్వామి, జస్టిస్‌ సి.ప్రవీణ్‌ కుమార్‌తో కూడిన ధర్మాసనం బుధవారం ఆదేశించింది. సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ ఎస్‌ఈసీ దాఖలుచేసిన అప్పీల్‌ను పరిష్కరించింది. 

సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘిస్తూ.. 1న ఎస్‌ఈసీ ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేసిందని పేర్కొంటూ వర్ల రామయ్య వ్యాజ్యం దాఖలు చేయడం.. విచారణ జరిపిన సింగిల్‌ జడ్జి.. 8న పోలింగ్‌ను నిలిపివేస్తూ మంగళవారం మధ్యంతర ఉత్తర్వులివ్వడం తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా పోలింగ్‌ తేదీకి 4 వారాల ముందు ఎన్నికల కోడ్‌ అమలు చేసేలా రీ-నోటిఫికేషన్‌ జారీ చేయాలని ఎస్‌ఈసీకి సూచించింది. 

ఈ ఆదేశాలపై ఎస్‌ఈసీ కార్యదర్శి కన్నబాబు మంగళవారమే అప్పీల్‌ వేశారు. దానిపై ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. వ్యాజ్యం వేసే అర్హత పిటిషనర్‌కు ఉందా లేదా అనే విషయాన్ని సింగిల్‌ జడ్జి నిర్దిష్టంగా తేల్చలేదని తెలిపింది. ‘మధ్యంతర ఉత్తర్వులు జారీచేసే సమయంలోనే తుది నిర్ణయం వెల్లడించినట్లుగా ఉంది. ఎందుకంటే కోడ్‌ విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా తాజా నోటిఫికేషన్‌ ఇవ్వాలని ఎస్‌ఈసీని ఆదేశించడం తుది ఉత్తర్వుల్లాంటివే’ అని పేర్కొంది. 

కోడ్‌ విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చాక నిర్వహించిన పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల్లో 4వారాలకు ముందుగా కోడ్‌ విధించలేదన్న విషయం సింగిల్‌ జడ్జి పరిగణనలోకి తీసుకోలేదు. సింగిల్‌ జడ్జి వద్ద వర్ల రామయ్య దాఖలు చేసిన వ్యాజ్యం పరిష్కారమయ్యేదాకా ఎన్నికల ఫలితాలను ప్రకటించవద్దు’ అని ఎస్‌ఈసీకి స్పష్టంచేసింది.

కాగా, ఎస్‌ఈసీ తరఫున సీనియర్‌ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. వ్యక్తిగత ప్రయోజనం లేనప్పుడు రిట్‌ పిటిషన్‌ దాఖలు చేయడానికి వీల్లేదని స్పష్టం చేశారు. పిటిషనర్‌ దాఖలు చేసిన వ్యాజ్యం ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని పోలి ఉందని.. దానిపై ధర్మాసనం విచారణ జరపాలని కోరారు. 

పిటిషనర్‌ ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, పిటిషన్‌ వేసేందుకు వర్ల రామయ్యకు అర్హత లేదని తాము వాదించినా సింగిల్‌ జడ్జి పరిగణనలోకి తీసుకోలేదని తెలిపారు. గతంలో ఎస్‌ఈసీ నిర్వహించిన పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల్లో 4వారాల ముందు కోడ్‌ విధించలేదని గుర్తు చేశారు.