తిరుపతిలో చంద్రబాబుపై దాడి 

తిరుపతిలో ఉప పోరు రోజురోజుకూ ఓ కొత్త రూపు తీసుకుంటుంది. టిడిపి తరపున ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు పాల్గొంటున్న విషయం విధితమే. అయితే.. సోమవారం రాత్రి కూడా చంద్రబాబు ప్రచారంలో ఉండగా గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు విసిరారు. ఈ దాడిలో మహిళ, యువకుడికి గాయాలయ్యాయి. 

దీంతో చంద్రబాబు వెంటనే వాహనంపై నుండి కిందకు దిగి రహదారిపైనే బైటాయించారు. సభకు పోలీసులు సరిగా రక్షణ కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. దీంతో తిరుపతిలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి ఆగిందని.. రౌడీయిజం పెరిగిందని మండిపడ్డారు. ‘‘తిరుపతిని ఏడు నుంచి 5 కొండలు చేస్తామని వైఎస్‌ అన్నాడు. పింక్‌ డైమండ్‌ మా ఇంట్లో ఉందని ఆరోపణలు చేశారు. ఇప్పుడు అసలు పింక్‌ డైమండే లేదంటున్నారు. రమణదీక్షితులు.. జగన్‌ను విష్ణుమూర్తితో పోల్చడమేంటి?’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. 

రాముడి తల తీసిన వాళ్లను పట్టుకోకుండా నిలదీసిన మాపై కేసులా?. ఖబడ్దార్‌ జగన్‌రెడ్డి.. మరో దేవాలయంపై దాడి జరిగితే అంతుచూస్తాం అంటూ హెచ్చరించారు. ఓట్ల కోసం ఇంటింటికి తిరుమల లడ్డూని పంచుతుంటే టీటీడీ అధికారులు ఏం చేస్తున్నారు? అని నిలదీశారు. వెంకటేశ్వరస్వామి మాత్రం మిమ్మల్ని వదలరని చంద్రబాబు హెచ్చరించారు. 

కాగా, తిరుపతిలో చంద్రబాబుపై రాళ్ల దాడి నేపథ్యంలో టీడీపీ నేతలు గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌ కోరారు. పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్లరామయ్య నేతృత్వంలో గవర్నర్‌ను కలిసేందుకు టీడీపీ నేతల ప్రయత్నిస్తున్నారు. 

జెడ్‌ ప్లస్‌ భద్రతలో ఉన్న చంద్రబాబుపై తిరుపతిలో రాళ్ల దాడి ప్రయత్నంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు, చంద్రబాబు భద్రతపై తగిన చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరనున్నారు. రాళ్ల దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని టీడీపీ నేతలు కోరనున్నారు.