భార‌త జ‌లాల్లో అమెరికా నేవీ ఆప‌రేష‌న్‌

అగ్ర‌రాజ్యం అమెరికాకు చెందిన యూఎస్ నేవీ 7వ ఫ్లీట్ భార‌త్ అనుమ‌తి లేకుండానే మ‌న దేశ ఎక్స్‌క్లూజివ్ ఎక‌నామిక్ జోన్‌లో ఆప‌రేష‌న్ నిర్వ‌హించింది. ఈ విష‌యాన్ని యూఎస్ నేవీయే ఓ ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది. 

ఒక దేశ ఎక్స్‌క్లూజివ్ ఎక‌నామిక్ జోన్‌లో మిలిట‌రీ క‌స‌ర‌త్తులు నిర్వ‌హించే ముందు ఆ దేశ అనుమ‌తి తీసుకోవాలి. కానీ యూఎస్ నేవీ మాత్రం ఈ నెల 7వ తేదీన ల‌క్షద్వీప్‌కు 130 నాటిక‌ల్ మైళ్ల దూరంలో ఫ్రీడ‌మ్ ఆఫ్ నావిగేష‌న్ ఆప‌రేష‌న్లు నిర్వ‌హించింది.

అంత‌ర్జాతీయ చ‌ట్టాల‌కు అనుగుణంగా తాము ఈ క‌స‌ర‌త్తులు నిర్వ‌హించామ‌ని, భార‌త్ నుంచి ముంద‌స్తు అనుమ‌తి తీసుకోలేద‌ని ఆ ప్ర‌క‌ట‌న‌లో యూఎస్ నేవీ 7వ ఫ్లీట్ తెలిపింది. 

భార‌త్‌కు స‌న్నిహితంగా ఉండే వ్యూహాత్మ‌క భాగ‌స్వాముల్లో ఒక‌టైన అమెరికా చేసిన ఈ ప‌ని ప్ర‌భుత్వానికి మింగుడుప‌డటం లేదు. గ‌తంలోనూ ఫ్రీడ‌మ్ ఆఫ్ నావిగేష‌న్ ఆప‌రేష‌న్ల‌ను తాము చేప‌ట్టామ‌ని, భ‌విష్య‌త్తులోనూ ఇలాగే చేప‌డ‌తామ‌ని అదే ప్ర‌క‌ట‌న‌లో యూఎస్ నేవీ చెప్ప‌డం గ‌మ‌నార్హం.

ఈ ప్ర‌క‌ట‌న‌పై భార‌త నేవీగానీ, విదేశాంగ శాఖ‌గానీ స్పందించ‌లేదు. క్వాడ్ గ్రూపులో భాగంగా ఉన్న భార‌త్‌, అమెరికా ఈ మ‌ధ్యే జ‌రిగిన స‌మావేశంలో ఇండో-ప‌సిఫిక్ ప్రాంతంలో ప‌ర‌స్ప‌ర స‌హకారానికి అంగీక‌రించాయి. ఇందులో ఫ్రీడ‌మ్ ఆఫ్ నావిగేష‌న్‌కు మ‌ద్ద‌తు తెల‌ప‌డం కూడా ఒక‌టి.