పూర్తి లాక్‌డౌన్ విధించకుండా చూడాలి 

కరోనా వైరస్ సోకుతున్న కేసులు నానాటికి పెరుగుతున్న నేపథ్యంలో పూర్తి లాక్‌డౌన్ విధించకుండా ప్రజలు చూడాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్య స్వామినాథన్ హెచ్చరించారు. మహమ్మారి సెకండ్‌ వేవ్‌ ఉన్నందున మార్గదర్శకాలు కచ్చితంగా పాటించకపోవడం వల్ల భవిష్యత్‌ పరిణామాలు భయంకరమైనవిగా ఉంటాయని స్పష్టం చేశారు. 

‘థర్డ్‌ వేవ్ గురించి ఆలోచించే ముందు సెకండ్‌ వేవ్‌ను తగినంత మందికి టీకాలు వేసే వరకు సక్రమంగా నిర్వహించాలి. మహమ్మారిలో ఖచ్చితంగా ఎక్కువ వేవ్స్‌ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి’ అని డాక్టర్ స్వామినాథన్ తెలిపారు.

కోవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు మోతాదుల మధ్య 8-12 వారాల వ్యవధిని డబ్ల్యూహెచ్‌ఓ సూచించడంతో.. పెద్ద సంఖ్యలో లబ్ధిదారులకు టీకాలు వేయడానికి ఎక్కువ అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. పిల్లలకు టీకాలు వేయడం ఇంకా సిఫారసు చేయలేదని, అయితే, రెండు డోసుల మధ్య అంతరాన్ని ఎనిమిది నుండి పన్నెండు వారాల వరకు విస్తరించవచ్చని డాక్టర్ స్వామినాథన్ చెప్పారు.

ఏప్రిల్ 7 ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా డబ్ల్యూహెచ్‌ఓ ప్రాంతీయ డైరెక్టర్ డాక్టర్ పూనమ్ ఖేత్రపాల్ సింగ్ మాట్లాడుతూ.. ఈ ప్రాంతం అంతటా కొత్తగా ఇన్ఫెక్షన్‌ వ్యాప్తి చెందుతున్నందున.. వ్యాక్సిన్ వేసే ప్రక్రియను వేగవంతం చేయడానికి ప్రయత్నాలు జరగాలని సూచించారు.