సౌదీ నుంచి రెండొంతుల చమురే కొనుగోలు

ఇంధ‌న ధ‌ర‌లను అదుపు చేయ‌డానికి ముడి చ‌మురు ఉత్ప‌త్తిని త‌గ్గించాల‌ని భార‌త్ చేసిన విజ్ఞ‌ప్తిని తోసిపుచ్చిన సౌదీ అరేబియాకు గ‌ట్టి ఎదురు దెబ్బ త‌గ‌ల‌నున్న‌ది. ఇప్ప‌టికే అన‌ధికారికంగా సౌదీ నుంచి ముడి చ‌మురు దిగుమ‌తిని త‌గ్గించిన భార‌త్‌.. ఇక అధికారికంగానే త‌గ్గించ‌నున్న‌ట్లు తేల్చేసింది. 

వ‌చ్చే నెల నుంచి సౌదీ అరేబియా నుంచి ముడి చ‌మురు కొనుగోలు త‌గ్గించి వేయాల‌ని కేంద్ర ముడి చ‌మురు సంస్థ‌లు నిర్ణ‌యించాయి. ఇప్ప‌టివ‌ర‌కు దిగుమ‌తి చేసుకున్న క్రూడాయిల్‌లో రెండొంతులు మాత్ర‌మే కొనుగోలు చేస్తాయి. 

ఈ మేర‌కు కేంద్ర ప్ర‌భుత్వ రంగ చ‌మురు సంస్థ‌లు.. ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్ (ఐవోసీ), మ‌రో మూడు సంస్థ‌లు వ‌చ్చే నెల‌లో సౌదీ అరేబియా నుంచి 15 మిలియ‌న్ల బ్యారెళ్ల ముడి చ‌మురు మాత్ర‌మే కొనుగోలు చేయ‌నున్న‌ట్లు అధికార వ‌ర్గాల స‌మాచారం. ఇది ఇప్ప‌టివ‌ర‌కు కొనుగోలు చేస్తున్న క్రూడాయిల్‌లో 65 శాత‌మే.

గ‌త నెల‌లో జ‌రిగిన ఒపెక్ ప్ల‌స్ స‌మావేశంలో ధ‌ర‌ల త‌గ్గింపున‌కు చ‌మురు ఉత్ప‌త్తిని త‌గ్గించాల‌ని భార‌త్ చేసిన విజ్ఞ‌ప్తిపై సౌదీ అరేబియా భిన్నంగా స్పందించింది. గ‌తేడాది చౌక‌గా కొనుగోలు చేసి, నిల్వ చేసిన చ‌మురును అదే ధ‌ర‌ల‌కు విక్ర‌యించాల‌ని భార‌త్‌కు రిప్ల‌యి ఇచ్చింది. దీంతో రెండు దేశాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ మొద‌లైంది.

దీంతో మిడిల్ ఈస్ట్ ఆవ‌ల స్పాట్ మార్కెట్ల నుంచి త‌క్ష‌ణ అవ‌స‌రాల‌కు అనుగుణంగా ముడి చ‌మురు కొనుగోలు చేయాల‌ని కేంద్ర చ‌మురు సంస్థ‌ల‌కు కేంద్ర ప్ర‌భుత్వం నుంచి ఆదేశాలు అందాయి. దీని ప్ర‌కారం సౌదీ ఇత‌ర ఒపెక్ దేశాల మార్కెట్ నుంచి నిర్దిష్ట ప‌రిమాణంలో (ఫిక్స్‌డ్‌) ముడి చ‌మురు కొనుగోలు త‌గ్గించుకోవాల‌ని నిర్ణ‌యానికి వ‌చ్చాయి.

కేంద్ర చ‌మురు సంస్థ‌లు.. ఇటీవ‌ల గుయానా నుంచి నార్వే వ‌ర‌కు గ‌ల కొత్త ప్రాంతాల్లో ముడి చ‌మురు కొనుగోళ్లు చేప‌ట్టాయి. దీంతోపాటు అమెరికా నుంచి ముడి చ‌మురు కొనుగోళ్లు పెరిగాయి. ఇంత‌కుముందే సౌదీ కంటే ఎక్కువ‌గా ముడి చ‌మురు భార‌త్‌కు విక్ర‌యించిన దేశాల్లో అమెరికా నిలిచింది.