అమెరికా రాజకీయాల్లో  టెక్‌ కంపెనీల ప్రాబల్యం

అమెరికా రాజకీయాల్లో ప్రస్తుతం బడా టెక్‌ కంపెనీల ప్రభావం, ప్రాబల్యం ఎంతలా పెరిగిపోయిందో తాజాగా విడుదలైన ఒ నివేదిక బయటపెట్టింది. ఇప్పటివరకు అమెరికా రాజకీయాలను ఎక్కువగా ప్రభావితం చేస్తూ వచ్చిన చమురు, పొగాకు కంపెనీల స్థానాన్ని బడా టెక్‌ కంపెనీలు ఇప్పుడు ఆక్రమించాయి.
 
2020 అమెరికా ఎన్నికల సందర్భంగా లాబీయింగ్‌పై బడా టెక్‌ కంపెనీలు దాదాపు 12.4కోట్ల డాలర్ల మేరకు ఖర్చు చేశాయి. ఎక్సాన్‌, ఫిలిప్‌ మారిస్‌లు ఖర్చు పెట్టిన దానికన్నా రెండింతలు ఫేస్‌బుక్‌, అమెజాన్‌లు ఖర్చుపెట్టాయి. పబ్లిక్‌ సిటిజన్‌ అనే సంస్థ ఇటీవల విడుదల చేసిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 
 
వ్యక్తిగత గోప్యత, ప్రజాస్వామ్యం, చిన్న వ్యాపారాలు, కార్మికులు అందరికీ ముప్పు కలిగించేలా చర్యలు తీసుకుంటున్నందుకు ఇటీవలి సంవత్సరాల్లో అమెజాన్‌, ఆపిల్‌, ఫేస్‌బుక్‌, గూగుల్‌ వంటి సంస్థలపై నిఘా పెరిగింది. తమ తమ మార్కెట్లలో గుత్తాధిపత్యాన్ని సాధించేందుకు ఈ కార్పొరేట్‌ కంపెనీలు దోపిడీ వ్యాపార పద్ధతులను తీవ్రతరం చేశాయి. 
 
లాభాల కోసం యూజర్‌ డేటాను అమ్ముకోవడంతో పాటు వర్ణ, మత, జాతి, వయస్సు, లింగ వివక్ష పెచ్చరిల్లడానికి వీలు కల్పించేలా చేశాయి. ఫేస్‌బుక్‌, గూగుల్‌ సంస్థలు మన ప్రజాస్వామ్య క్రమంపై కనివినీ ఎరుగని రీతిలో ఆధిపత్యం సాధించాయని పబ్లిక్‌ సిటిజన్‌ తన నివేదికలో పేర్కొంది. 
 
వీటిపై పెడుతున్న పెట్టుబడులు వినియోగదారులు, కార్మికులు, ఇతర వ్యాపారాలకు హానికరంగా పరిణమించాయి. 2018-2020 మధ్య కాలంలో లాబీయింగ్‌పై పెట్టే ఖర్చు పెరిగింది. అమెరికన్‌ కాంగ్రెస్‌ సభ్యులను ఆకట్టుకోవడానికి ఫేస్‌బుక్‌ 56శాతం ఖర్చు పెట్టింది. తన లాబీయిస్ట్‌ల సంఖ్యను కూడా 40కి పైగా పెంచుకోగలిగింది. 
 
2018లో 293గా వున్న వీరి సంఖ్య 2020లో 333కి పెరిగింది. ఈ లాబీయింగ్‌లో ఫేస్‌బుక్‌, అమెజాన్‌ల పెరుగుదల చాలా వేగంగా వుందని ఆ నివేదిక పేర్కొంది. మొత్తంగా కార్పొరేట్‌ లాబీయింగ్‌ జాబితాలో ఫేస్‌బుక్‌, అమెజాన్‌లు అగ్ర స్థానంలో వున్నాయి. వాస్తవానికి, మూడో స్థానంలో వున్న కామ్‌కాస్ట్‌ కన్నా అమెజాన్‌ 30శాతం ఎక్కువగా ఖర్చు పెట్టిందని నివేదిక పేర్కొంది.
 
తమ మాజీ సహచరులు, బాస్‌లు, సంస్థలను లాబీ చేసేందుకు మాజీ కాంగ్రెస్‌ సభ్యులను, ఎఫ్‌టిసి అధికారులను, ఇతర ప్రభుత్వ అధికారులను రిక్రూట్‌ చేసుకోవడం ద్వారా అమెజాన్‌ తన రాజకీయ వ్యూహానికి పదును పెడుతోంది. దాదాపు 94శాతం మంది కాంగ్రెస్‌ సభ్యులు ఇలా అమెజాన్‌, ఫేస్‌బుక్‌ వంటి సంస్థల నుండి ముడుపులు అందుకున్నవారేనని నివేదిక పేర్కొంది.

మన ఆర్థిక వ్యవస్థలో, మన రోజువారీ జీవితాల్లో ఈ కంపెనీల పెత్తనం రాన్రాను పెరిగిపోతుండడం సామాజిక సమస్యలను మరింత తీవ్రతరం చేస్తున్నాయని, వాటిపై తక్షణమే రాజకీయ ప్రతిస్పందన అవసరమని నివేదిక అభిప్రాయపడింది. బడా టెక్‌ కంపెనీలన్నీ అపారంగా వున్న తమ ఆర్థిక, సామాజిక శక్తులను రాజకీయ ప్రాబల్యం కిందికి తీసుకొస్తున్నాయి. 
 
ఫలితంగా కీలకమైన సమస్యలను పరిష్కరించే చేవ మన రాజకీయ వ్యవస్థకు సన్నగిల్లుతోంది. బడా టెక్‌ కంపెనీలు అసాధారణంగా సంపాదించిన ఆస్తులు, అధికారాల్లోనే ఈ సమస్య ప్రతిబింబిస్తోంది.