మళ్ళి ఒకేరోజు లక్ష దాటిన కరోనా కేసులు 

దేశంలో కరోనా కరాళ నృత్యం చేస్తూ మళ్లీ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రోజురోజుకు పెరుగుతున్న కొత్త కేసుల సంఖ్యను చూస్తుంటే గుండెల్లో భయాందోళనలు రేగుతున్నాయి. తాజాగా ఆదివారం నుంచి సోమవారం వరకు 24 గంటల వ్యవధిలో 1,03,558 కరోనా కేసులు నమోదయ్యాయి. 
 
కరోనా ప్రభావం మొదలైన నాటి నుండి ఇప్పటి వరకు భారత్‌లో ఈ సంఖ్య నమోదు కావడం ఇదే ప్రథమం. గత ఏడాది సెప్టెంబర్‌లో నమోదైన 97,894 కేసులే ఇప్పటి వరకు అత్యధికం. అమెరికా తర్వాత ఈ స్థాయిలో కేసులు భారత్‌లోనే నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,25,89,067కు చేరింది. 
 
కొత్తగా 478 మంది కోవిడ్‌కు బలయ్యారు. దీంతో ఆ సంఖ్య 1,65,101కి పెరిగిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం వెల్లడించింది. అదేవిధంగా కేసులు పెరుగుతుడటంతో యాక్టివ్‌ కేసుల సంఖ్య కూడా పైకి ఎగబాకుతోంది. వరుసగా 26వ రోజు కూడా యాక్టివ్‌ కేసులు పెరిగాయి. 
 
ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 7,41,830గా ఉంది. కొత్తగా నమోదైన కేసుల్లో ఒక్క మహరాష్ట్రలోనే 57, 074 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 29 లక్షల మంది కరోనా బారిన పడ్డారు. మరోవైపు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభించిన నాటి నుండి… ఆదివారం వరకు 7.91 కోట్ల డోసులు ఇచ్చినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
 
స్టాక్‌ మార్కెట్‌ను కరోనా భయాలు మరోసారి వెంటాడాయి. ఒక్క రోజులోనే లక్షకు పైగా కొత్త కేసులు నమోదు కావడంతో దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకోవడంపై ఇన్వెస్టర్లలో తీవ్ర ఆందోళనలు రెకెత్తాయి. ఆర్థిక రాజధాని ముంబైలో లాక్‌డౌన్‌ విధింపు మార్కెట్‌ వర్గాలను కలవరపెట్టింది. కేసుల కట్టడికి మరిన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్‌ వైపు చూస్తున్నాయనే వార్తలు సెంటిమెంట్‌ను మరింత బలహీనపరిచాయి. 
 
మరోవైపు మ్యానుఫ్యాక్చరింగ్‌ పీఎంఐ సూచీ మార్చిలో 55.4కు పడిపోయి ఏడు నెలల కనిష్టస్థాయికి దిగివచ్చింది. డాలర్‌ మారకంలో రూపాయి 18 పైసలు పతనమైంది. సూచీల గరిష్ట స్టాయిల వద్ద లాభాల స్వీకరణ చోటు చేసుకుంది.

కొత్త కేసుల్లో దాదాపు 56 శాతం మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. అయితే, సెకండ్‌ వేవ్‌ ఉధృతితో ఢిల్లీ (4 వేలు), ఛత్తీ్‌సగఢ్‌ (5,250), కర్ణాటక (4,553), తమిళనాడు (3,581), పంజాబ్‌ (3,019), మధ్యప్రదేశ్‌ (3,178), గుజరాత్‌ (2,900) ఇలా ప్రతి రాష్ట్రంలోనూ పాజిటివ్‌లు భారీగా పెరుగుతున్నాయి. ఢిల్లీలో కేసులు 4 వేలు దాటడం 4 నెలల తర్వాత ఇదే తొలిసారి. ఛత్తీ్‌సగఢ్‌లో తీవ్రత అధికమవుతోంది. దుర్గ్‌ జిల్లాలోనే వెయ్యి కేసులు రికార్డయ్యాయి. దీంతో మూడో వంతు టీకా సెంటర్లను రోజంతా తెరిచి ఉంచాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఈశాన్యంలోని 8 రాష్ట్రాల్లో మాత్రం కరోనా తీవ్రత కనిపించడం లేదు.

రాజస్థాన్‌లోని ఐఐటీ జోధ్‌పూర్‌లో 70 మంది వరకు విద్యార్థులకు పాజిటివ్‌ వచ్చింది. మహారాష్ట్రలో ప్రధాన నగరాలైన ముంబై(11,200), పుణె (12,500 కేసులు- 64 మరణాలు) వైర్‌సతో వణుకుతున్నాయి. రాష్ట్రంలో బాధితులు 30 లక్షలు దాటారు. ప్రపంచంలో 9 దేశాల్లోనే ఈ స్థాయిలో కేసులు రికార్డయ్యాయి.