
కాగా, టెలీ హెల్త్, టెలీ మెడిసిన్ సేవల మార్కెట్ పెరిగిందని నీతిఆయోగ్ పేర్కొంది. పేషెంట్లు విదేశీ డాక్టర్లతో నేరుగా మాట్లాడే వసతి ఏర్పడిందని తెలిపింది. కొన్ని ఆస్పత్రులు ఇండ్లలోనే వెంటిలేటర్ సౌకర్యం కల్పిస్తున్నాయని.. పాలియేటివ్ కేర్, కేన్సర్ వైద్య సేవలు, ప్రమాదాల బారినపడి ఇళ్లల్లో ఉండేవారికి వైద్య సేవలు, న్యూరో, కార్డియాక్ వంటి సేవలు పెరుగుతున్నాయని వివరించింది.
మొత్తంగా ఆరోగ్య రంగంలో కొత్త అవకాశాలు, పెరిగిన మార్కెట్‌తో దేశంలోని 50 నగరాల్లో ఏటా 2 లక్షల ఉద్యోగాలు లభిస్తున్నాయని పేర్కొంది. దేశంలో మెడికల్ టూరిజం పెరుగుతోందని నీతి ఆయోగ్ తెలిపింది. 2017లో అంతర్జాతీయంగా 20 టాప్ మెడికల్ టూరిజం మార్కెట్లలో భారత్ ఏడో ర్యాంకులో ఉందని వెల్లడించింది. ఆసియా– పసిఫిక్ ప్రాంతంలోని 10 మంచి టూరిజం మార్కెట్లలో మూడో స్థానంలో ఉందని తెలిపింది.
2022 నాటికి దేశంలో 13 బిలియన్ అమెరికన్ డాలర్ల మెడికల్ టూరిజం నమోదవుతుందని అంచనా వేసింది. 2014లో 1.84 లక్షలు, 2015లో 2.33 లక్షలు, 2016లో 4.27 లక్షలు, 2017లో 4.95 లక్షల మంది వివిధ వ్యాధులకు చికిత్స కోసం మన దేశానికి వచ్చారని.. ఈ సంఖ్య 2019లో 6.97 లక్షలకు పెరిగిందని నివేదికలో వెల్లడించింది.
గత ఐదేండ్లలో దేశంలో ఆరోగ్య సంరక్షణ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని నీతి ఆయోగ్ తెలిపింది. ఆదాయంతోపాటు ఉపాధి కల్పనలోనూ ఆరోగ్య రంగం పెద్దదిగా మారిందని.. డ్రగ్స్, ఫార్మాస్యూటికల్స్, హాస్పిటల్స్, డయాగ్నస్టిక్ సెంటర్లు, మెడికల్ అండ్ సర్జికల్ అప్లయెన్సెస్‌లో ఎఫ్‌డీఐలు పెరిగాయని వివరించింది. కేంద్రం మెడికల్ కాలేజీల సంఖ్యను పెంచిందని తెలిపింది.
అలాగే ప్రతి జిల్లా ఆస్పత్రికి మెడికల్ కాలేజీని అనుసంధానించే ప్రణాళికను కూడా అమలు చేస్తోందని వెల్లడించింది. దేశంలో గత పదేళ్లలో దాదాపు 4 లక్షల మంది రిజిస్టర్డ్ డాక్టర్లు పెరిగారని తెలిపింది. ప్రస్తుతం దేశంలో 6 కోట్ల మంది షుగర్ వ్యాధితో బాధపడుతున్నారని, ఈ సంఖ్య 2025 నాటికి 9 కోట్లకు చేరుతుందని తెలిపింది.
వైద్య రంగంలో నిపుణులు, నాణ్యమైన ఆరోగ్య వసతులు, చికిత్సకు తక్కువ ఖర్చు వంటివి మన దేశంలో మెడికల్ టూరిజం పెరగడానికి కారణమని నీతి ఆయోగ్ పేర్కొంది. థాయ్‌లాండ్, మలేషియా, సింగపూర్, టర్కీ, దక్షిణ కొరియా దేశాలతో పోలిస్తే.. మన దేశంలో తక్కువ ధరలోనే కీలక వైద్య చికిత్సలు అందుబాటులో ఉన్నాయని వివరించింది.
మన దేశంలో గుండె బైపాస్ సర్జరీకి 7,900 అమెరికన్ డాలర్లు వసూలు చేస్తుండగా.. థాయ్‌లాండ్‌లో 15 వేల డాలర్లు, మలేషియాలో 12,100 డాలర్లు, సింగపూర్‌లో 17,200 డాలర్లు, దక్షిణ కొరియాలో 26 వేల డాలర్లు వసూలు చేస్తున్నారని తెలిపింది.
గుండె వాల్వ్ రీప్లేస్‌మెంట్‌కు మన దేశంలో 9,500 డాలర్లు, థాయ్‌లాండ్‌లో 17,200 డాలర్లు, మలేషియాలో 13,500 డాలర్లు, సింగపూర్‌లో 16,900 డాలర్లు, టర్కీలో 17,200 డాలర్లు, దక్షిణకొరియాలో ఏకంగా 39,990 డాలర్లు వసూలు చేస్తున్నారని పేర్కొంది. ఇవేకాదు.. మోకాళ్ల మార్పిడి, గ్యాస్ట్రిక్ స్లీవ్, గ్యాస్ట్రిక్ బైపాస్, ఐవీఎఫ్ వంటి అనేక చికిత్సలకు మనదేశంలో తక్కువ ఫీజులు ఉన్నాయని.. అదే సమయంలో నాణ్యమైన చికిత్స అందుతోందని తెలిపింది.
More Stories
బంగారు లక్ష్మణ్ కు ఘనంగా నివాళులు
ఐదేండ్లలో రూ. 400 కోట్ల పన్ను చెల్లించిన అయోధ్య ట్రస్ట్
దళారుల చేతుల్లో మోసపోతున్న తిరుమల భక్తులు