45 ఏళ్లు పైబడితే ప్రభుత్వోద్యుగులు వ్యాక్సిన్ తీసుకోండి

కరోనా కేసులు వేగంగా విస్తరిస్తుండటంతో 45 ఏళ్లు, ఆపై బడిన ప్రభుత్వ ఉద్యోగులంతా వ్యాకిన్ వేయించుకోవాలని కేంద్రం తాజాగా విజ్ఞప్తి చేసింది. కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్  మీడియాతో మాట్లాడుతూ దేశంలోని మొత్తం కేసుల్లో ఒక్క మహారాష్ట్రలోనే 58 శాతం యాక్టివ్ కేసులు, 34 శాతం మరణాలు ఉన్నట్టు తెలిపారు.

అత్యంత యాక్టివ్ కేసులున్న 10 జిల్లాల్లో 7 జిల్లాలు మహారాష్ట్రలో, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీల్లో ఒక్కో జిల్లా ఉన్నట్టు చెప్పారు. పంజాబ్, ఛత్తీస్‌గఢ్‌లో మరణాల సంఖ్య కూడా తీవ్ర ఆందోళన కలిగిస్తోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్‌టీ-పీసీఆర్ పరీక్షలు పెంచాలని ఈ సందర్భంగా భూషణ్ సూచించారు.

మహారాష్ట్రలో గత వారంలో కేవలం 60 శాతం ఆర్‌టీ-పీసీఆర్ పరీక్షలు జరిగాయని, రాష్ట్రాలు పరీక్షల శాతాన్ని 70 శాతానికి పెంచాలని ఆరోగ్య శాఖ సూచిస్తోందని పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్ చిన్న రాష్ట్రమే అయినప్పటికీ దేశంలోని మొత్తం కేసుల్లో 6 శాతం, మరణాల్లో 3 శాతం ఉండటం ఆందోళన కలిగిస్తున్నట్టు చెప్పారు. సెకెండ్ వేవ్‌లో ఛత్తీస్‌గఢ్‌లో పరిస్థితి దిగజారినట్టు తెలిపారు.

మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, పంజాబ్‌లలో 15 ఉన్నత స్థాయి మల్టీడిసిప్లెనరీ పబ్లిక్ హెల్త్ బృందాలను మోహరించినట్టు ఆయన చెప్పారు. మహారాష్ట్రలోని 30 జిల్లాలు, ఛత్తీస్‌గఢ్‌లోని 6, పంజాబ్‌లోని 9 జిల్లాల్లో ఈ బృందాలు పర్యటిస్తాయని భూషణ్ వివరించారు. కరోనా వ్యాప్తి నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్రాల ఆరోగ్య శాఖలు, జిల్లా యంత్రాగానికి ఈ బృందాలు సహకరిస్తాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు రోజువారు నివేదకలు కూడా అందిస్తాయని తెలిపారు.

కాగా, కరోనా టీకాలు ప్రజలందరికీ ఎందుకు అందుబాటులోకి రాలేదనే అంశంపై కేంద్ర ఆరోగ్య శాఖ సెక్రెటరీ తాజాగా కీలక వ్యాఖ్య చేశారు. ఇటువంటి కార్యక్రమాల ప్రధాని లక్ష్యం మరణాలను నిరోధించడంతో పాటు దేశ ఆరోగ్య వ్యవస్థలపై ఒత్తిడి తగ్గించడమని స్పష్టం చేశారు. టీకాలు కోరుకున్నవారికి వారికి కాకుండా ఇవి అవసరమైన వారికే టీకా ఇవ్వడం వ్యాక్సినేషన్ కార్యక్రమం అసలు లక్ష్యం అని పేర్కొన్నారు. 

ఇలా ఉండగా, కోవిడ్-19 కేసులు పెరుగుతున్నందువల్ల దేశవ్యాప్తంగా 18 సంవత్సరాల వయసు పైబడినవారందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసింది. ప్రస్తుతం 45 ఏళ్ళ వయసు పైబడినవారికి వ్యాక్సిన్ ఇస్తున్నారని, కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్నందువల్ల 18 సంవత్సరాల వయసు పైబడినవారందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని కోరింది.

యుద్ధ ప్రాతిపదికపై వ్యాక్సినేషన్ జరిగే విధంగా వ్యూహాలను రూపొందించాలని కోరింది. ప్రైవేటు ఆసుపత్రులు, వైద్యుల వద్ద కూడా వ్యాక్సిన్‌ను అందుబాటులో ఉంచాలని సలహా ఇచ్చింది. దీనివల్ల వ్యాక్సినేషన్‌ కార్యక్రమంపై పాజిటివ్ ప్రభావం పడుతుందని తెలిపింది. బహిరంగ ప్రదేశాల్లోకి ప్రవేశించడానికి, ప్రజా పంపిణీ వ్యవస్థ క్రింద వస్తువులను పొందడానికి తప్పనిసరిగా వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ ఉండాలనే నిబంధనను ప్రవేశపెట్టాలని కోరింది.