చనిపోయిన పోలీసుల కుటుంబాలకు మావోయిస్టుల సంతాపం

ఛత్తీస్‌గఢ్ ‌ లో 23 మంది జవాన్లను చంపి, మరొకరిని బందీగా తీసుకున్న మావోయిస్టులు తమ దాడిలో మృతి చెందిన పోలీసుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు.  ఎన్‌కౌంటర్‌ ఘటనపై దండకారణ్య ప్రత్యేక జోనల్‌ కమిటీ పేరిట మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. 

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నాయకత్వంలో భారీ దాడులకు పథకం రచించారని, 2 వేల మంది పోలీసులు భారీస్థాయిలో తమపై దాడికి వచ్చినట్లు తెలిపారు. ఐదు రాష్ట్రాల పోలీసు అధికారులతో దాడికి పథకం వేశారని పేర్కొన్నారు. పోలీసుల దాడికి తాము ప్రతిదాడి చేసినట్లు చెప్పారు. 

ప్రతిఘటనలో 23 మంది పోలీసులు చనిపోగా పోలీసుల దాడిలో తమ సభ్యులు నలుగురు మృతిచెందారని పేర్కొన్నారు. ఓ పోలీసు తమకు బందీగా దొరికినట్లు వెల్లడించారు. మధ్యవర్తుల పేర్లు ప్రకటిస్తే బందీగా ఉన్న పోలీసుని అప్పగించనున్నట్లు ప్రకటించారు. పేర్లు ప్రకటించే వరకు పోలీసు తమ వద్ద క్షేమంగా ఉంటారని పేర్కొంటూ  పోలీసులు తమకు శత్రువులు కాదని స్పష్టం చేశారు. కాగా, చర్చలకు తామెప్పుడు సిద్ధమేనని.. ప్రభుత్వానికే చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. 

210 కోబ్రా బెటాలియ‌న్‌లోని కానిస్టేబుల్ రాకేశ్వ‌ర్ సింగ్ మ‌న్హాస్ .. ఎన్‌కౌంట‌ర్ తర్వాత ఆచూకీ లేడు. సీఆర్‌పీఎఫ్‌కు ఎలైట్ యూనిట్‌గా కోబ్రా క‌మాండోలు ప‌నిచేస్తున్నారు.  జ‌రిగిన ఎదురుకాల్పుల్లో 22 మంది జ‌వాన్లు వీర‌మ‌ర‌ణం పొందారు. జ‌వాను మిస్సైన‌ట్లు ఇప్పుడు ద్రువీక‌రించ‌లేమ‌ని, ఆ జ‌వానుకు సంబంధించిన ఫోటోల‌ను మావోలు ఇంకా రిలీజ్ చేయ‌లేద‌ని, అత‌న్ని గుర్తంచేందుకు అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నామ‌ని బ‌స్త‌ర్ రేంజ్ ఐజీ సుంద‌ర్‌రాజ్ తెలిపారు.

త‌న తండ్రిని విడిచిపెట్టాల‌ని క‌మాండో రాకేశ్ కుమార్తె కోరింది. అయిదేళ్ల కుమార్తె ఏడుస్తున్న వీడియో ఒక‌టి రిలీజై అయ్యింది. త‌న తండ్రిని విడిచి పెట్టాల‌ని కోరుతూ ఏడుస్తూ ఆమె వేడుకున్న‌ది. జ‌మ్మూలో ఉన్న‌ క‌మాండో రాకేశ్ భార్య మీనూ .. సీఆర్‌పీఎఫ్ ప్ర‌ధాన కార్యాల‌యంతో మాట్లాడింది. 

కానీ త‌మ‌కు ఎటువంటి స‌మాచారం తెలియ‌ద‌ని వారు చెప్పిన‌ట్లు మీనూ పేర్కొన్న‌ది. త‌న భ‌ర్త‌ను వ‌దిలిపెట్టాల‌ని మావోల‌ను మీనూ కోరింది. త‌న భ‌ర్త ప‌దేళ్లు దేశం కోసం సేవ చేశార‌ని, ప్ర‌భుత్వం చొర‌వ తీసుకుని త‌న భ‌ర్త‌ను కాపాడాల‌ని ఆమె వేడుకున్న‌ది. ప్ర‌ధాని మోదీ, అమిత్ షాల‌తో ఈ విష‌యాన్ని చ‌ర్చించాల‌ని ఆమె క‌శ్మీర్ గ‌వ‌ర్న‌ర్ మ‌నోజ్ సిన్హాను కోరింది.