పంజాబ్‌ నుంచి యూపీకి గ్యాంగ్‌స్టర్‌ తరలింపు

గ్యాంగ్‌స్టర్ నుంచి రాజకీయ నాయకుడిగా మారిన బహుజన్ సమాజ్ పార్టీ ఎమ్మెల్యే ముక్తార్ అన్సారీని పంజాబ్‌లోని రూప్‌నగర్ జైలు నుంచి ఉత్తరప్రదేశ్‌లోని బాందా జైలుకు తరలించారు. ఉత్తరప్రదేశ్‌తో పాటు ఇతర ప్రదేశాల్లో మొత్తం 52 కేసులను ముక్తార్ ఎదుర్కొంటున్నారు. 
 
ఆయనతో పాటు మరో 15 మందిపై కూడా విచారణ కొనసాగుతోంది. ఈ విషయమై పంజాబ్ డీజీపీ ప్రవీణ్ కుమార్ సిన్హా మాట్లాడుతూ ముక్తార్ అన్సారీని ఉత్తరప్రదేశ్ పోలీసులకు అప్పగించినట్లు పేర్కొన్నారు.  ఆయన మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ మేనల్లుడు. 

ముక్తార్ అన్సారీ గత జనవరి 2019 నుంచి రూప్‌నగర్ జైలులో ఉంటున్నారు. కాగా, ఈ ఏడాది మార్చి 26న ఆయనను పంజాబ్ నుంచి ఉత్తప్రదేశ్‌కు మార్చాలని దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఆ సూచనల మేరకే తాజాగా ఆయనను ఉత్తరప్రదేశ్‌లోని బాందా జిల్లాలో ఉన్న జైలుకు తరలించారు.

ముక్తార్ అన్సారీ, ఉత్తరప్రదేశ్‌లోని మౌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇదే నియోజకవర్గం నుంచి ఐదుసార్లు బహుజన్ సమాజ్ పార్టీ తరపున ఎన్నికయ్యారు.