త్వరలో పని ప్రదేశాల్లోనే కొవిడ్‌ టీకాలు

త్వరలో కార్యాలయాల్లో కొవిడ్ టీకా సెషన్లను నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. దేశంలో కొనసాగుతున్న టీకా డ్రైవ్‌ను వేగవంతం చేసే ప్రయత్నంలో భాగంగా పని ప్రదేశాల్లోనే కరోనా టీకా సెషన్లను నిర్వహించడానికి ప్రభుత్వం అనుమతించవచ్చని తెలుస్తున్నది. 

ఇప్పటికే ఉన్న కోవిడ్ టీకా కేంద్రంతో ఈ కార్యాలయాలను ట్యాగ్ చేయడం ద్వారా 100 మంది అర్హతగల, సిద్ధంగా ఉన్న లబ్ధిదారులకు కార్యాలయాల్లోనే టీకాలు ఇచ్చేలా చూడొచ్చు. ఈ మాదిరి కార్యాలయాల్లో టీకా కేంద్రాలను ఏప్రిల్ 11 నుంచి రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలలో ప్రారంభించనున్నట్లు తెలుస్తున్నది.

కొవిడ్-19 వ్యాక్సిన్ కవరేజ్ పరిధిని పెంచాలని చాలా ప్రాంతాల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. ముఖ్యంగా ఇన్ఫెక్షన్‌ కేసులు తిరిగి పుంజుకుంటున్న నేపథ్యంలో టీకాలు వేయడానికి వయోపరిమితిని తగ్గించాలని పలువురు ముఖ్యమంత్రులు కేంద్రాన్ని కోరారు. 

ఇదే సమయంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసింది. 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వారందరికీ టీకాలు వేయాలని సూచించింది. ప్రస్తుతం 45 ఏండ్ల వయసు పైబడిన వారికి టీకాలు వేస్తున్నామని, కొవిడ్‌-19 సెకండ్‌ వేవ్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా టీకా వ్యూహాన్ని తక్షణ ప్రభావంతో.. యుద్ధ ప్రాతిపదికన అందించాలని భావిస్తున్నాం అని ప్రధాని మోదీకి రాసిన లేఖలో ఐఎంఏ తెలిపింది.

జనవరి 16 వ తేదీ నుంచి మన దేశంలో కరోనా టీకాలు వేయడం ప్రారంభించారు. ఈ నెల ఒకటో తేదీ నుంచి 45 ఏండ్ల వయసు పైబడిన వారికి కూడా కొవిడ్‌ వ్యాక్సిన్లు ఇవ్వడం మొదలుపెట్టారు. ఇప్పటివరకు దాదాపు 8.70 కోట్ల మంది వ్యాక్సిన్‌ ఇచ్చినట్లు ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నాయి.