మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో 60 గంట‌ల పాటు లాక్‌డౌన్‌

క‌రోనా కేసులు పెరిగిపోతున్న నేప‌థ్యంలో మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో 60 గంట‌ల పాటు లాక్‌డౌన్ విధిస్తున్న‌ట్లు గురువారం ప్ర‌క‌టించారు ఆ రాష్ట్ర సీఎం శివ‌రాజ్ సింగ్ చౌహాన్‌. శుక్ర‌వారం సాయంత్రం 6 గంట‌ల నుంచి సోమ‌వారం ఉద‌యం 6 గంట‌ల వ‌రకు ఈ లాక్‌డౌన్ అమ‌ల్లో ఉండ‌నుంది. 

సంక్షోభ నిర్వ‌హ‌ణ బృందం స‌మావేశం త‌ర్వాత కేసులు పెరిగిపోతున్న ప‌ట్ట‌ణాల్లో ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవాలో నిర్ణ‌యం తీసుకుంటామ‌ని శివ‌రాజ్‌సింగ్ చెప్పారు. పెద్ద న‌గ‌రాల్లో మ‌రోసారి కంటైన్మెంట్ జోన్ల‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు తెలిపారు. గ‌త 24 గంట‌ల్లోనే మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో 4 వేల‌కు పైగా కేసులు న‌మోద‌య్యాయి.

ఇప్ప‌టి వ‌ర‌కూ రాష్ట్రంలో మొత్తం 3.18 ల‌క్షల మంది క‌రోనా బారిన ప‌డ్డారు. మ‌ధ్యప్ర‌దేశ్‌లో పెద్ద న‌గ‌రాలైన ఇండోర్‌, భోపాల్‌ల‌లో కేసుల సంఖ్య చాలా ఎక్కువ‌గా ఉంది. ఇండోర్‌లోనే గ‌త 24 గంట‌ల్లో 866 కేసులు న‌మోద‌య్యాయి. ఇప్పటి వ‌ర‌కూ రాష్ట్రంలో క‌రోనా కార‌ణంగా 4 వేల మందికిపైగా చ‌నిపోయారు.

కాగా,  అస్సాంలో నైట్‌ కర్ఫ్యూ విధించాల్సిన అవసరం లేదని ఆ రాష్ట్ర మంత్రి హిమంత బిస్వా శర్మ గురువారం తెలిపారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితి అదుపులోనే ఉన్నదని  ఆయన చెప్పారు. అయితే ముంబై, కర్ణాటక నుంచి విమానాల్లో వచ్చే ప్రయాణికులు ఇక్కడ తప్పనిసరిగా కరోనా పరీక్ష చేయించుకోవాలని తెలిపారు.

ప్రయాణికులు ఆయా రాష్ట్రాల్లో కరోనా పరీక్ష చేయించుకున్నప్పటికీ అస్సాంలో కూడా తప్పనిసరి అని పేర్కొన్నారు. ఈ ఏడాది అస్సాంలో బిహూ వేడుకను జరుపుతామని మంత్రి హిమంత బిస్వా శర్మ తెలిపారు. ఈ వేడుకకు ముందు గరిష్ఠ సంఖ్యలో ప్రజలకు కరోనా పరీక్షలు నిర్వహిస్తామని, కరోనా సోకిన వారిని ఐసొలేట్‌ చేస్తామని వెల్లడించారు.