వివేకానంద స్మారక మందిరానికి రూ.80 లక్షలతో కొత్త పడవ

కన్నియాకుమారి సముద్రం మధ్య నిర్మించిన వివేకానంద స్మారక మందిరానికి రూ.80 లక్షల వ్యయంతో ప్రభుత్వ పర్యాటక శాఖ కొత్త పడవను కొనుగోలు చేసింది. కన్నియాకుమారి సముద్రం మధ్య బండరాయిపై అద్భుత కళాత్మకంగా రూపొందించిన స్వామి వివేకానంద స్మారకమండపాన్ని ప్రతిరోజూ వేలాదిమంది స్వదేశీ, విదేశీ పర్యాటకులు పడవలో వెళ్లి సందర్శిస్తుంటారు. 

రాష్ట్రప్రభుత్వ నిర్వహణలోని పుంపుహార్‌ నౌకాయాన సంస్థ ఈ మందిరానికి పడవ నడుపుతోంది. ఇందుకోసం పొదిగై, గుహన్‌, వివేకానంద అనే మూడు పడవల ద్వారా పర్యాటకులను తీసుకెళ్తున్న నేపథ్యంలో, కొత్తగా తామరభరణి, తిరువళ్లువర్‌ అనే పేర్లతో రెండు ఎయిర్‌ కండిషన్‌ వసతి కలిగిన ఆధునిక లగ్జరీ పడవలను రూ.8 కోట్లకు కొనుగోలు చేసింది.

ఇదిలా వుండగా, వివేకానంద స్మారక మండపం తరఫున అందులో పనిచేస్తున్న ఉద్యోగుల కోసం కొత్త పడవను కొనుగోలు చేశారు. కొచ్చిలో ఉన్న ఐస్మార్ట్‌ అనే పడవ నిర్మాణ సంస్థ 49.6 అడుగల పొడవు, 29.5 అడుగుల వెడల్పు, 26 టన్నుల బరువుతో హైటెక్‌ వసతులతో రూపొందించిన ఈ పడవను మంగళవారం కొచ్చి నుంచి కన్నియాకుమారికి తరలించారు. 

పుంపుహార్‌ నౌకా నిర్మాణ సంస్థ ఓడరేవుకు వచ్చిన ఈ పడవకు కేంద్రీయ నిర్వాహక అధికారి అనంతశ్రీ పద్మనాభన్‌ నేతృత్వంలోని అధికారులు, సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు.