ముందుగా కష్టమైన సబ్జెక్టులను ఎంచుకోండి

ఖాళీ సమయం దొరికినప్పుడల్లా చాలా విలువైనదిగా భావించాలని, ఆ సమయాన్ని సద్వినియోగపర్చుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. ఇలాంటి పనుల వల్ల చిన్నారుల్లో ఏదో ఒకటి సాధించాలన్న తపన పెరుగుతుందని పేర్కొన్నారు. 

కొత్త విషయాలను అన్వేషించడానికి ప్రయత్నించాలని ప్రధాని  చెప్పారు. అయితే, పరీక్షల వేళ మీ సమయాన్ని వృథా చేసే ఇటువంటి కార్యకలాపాలకు దూరంగా ఉండాలని హితవు చెప్పారు. ఖాళీ సమయాన్ని క్రీడలు, సంగీతం, పెయింటింగ్ మొదలైన వాటిలో ప్రావీణ్యత పెంచుకోవడం ద్వారా భావోద్వేగాలను సానుకూల రీతిలో వ్యక్తీకరించడానికి మంచి మార్గాలుగా ఉపయోగపడతాయని చెప్పారు.

మొదట అధ్యయనం చేసేటప్పుడు కష్టమైన సబ్జెక్టులతో ప్రారంభించాలని, తరువాత తేలికైన విషయాలను తేలిగ్గా పరిష్కరించుకోవచ్చని ప్రధాని మోదీ వివరించారు. కొన్ని సబ్జెక్టులను అధ్యయనం చేయడం కష్టమైన పనే అని, అయినంత మాత్రాన కష్టమైన విషయాల నుంచి పారిపోవద్దు అని ఆయన తెలిపారు.

పరీక్షా పే చర్చ కార్యక్రమం బుధవారం రాత్రి 7 గంటలకు నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆన్‌లైన్‌లో వర్చువల్‌గా మాట్లాడారు. ఈ సంవత్సరం పరీక్షా పే చర్చ ఇది నాలుగోది. కరోనా వైరస్‌మహమ్మారి కారణంగా ప్రధాని మోదీ వర్చువల్ మోడ్‌లో ఇంటరాక్ట్ అయ్యారు.

ఈ కార్యక్రమంలో పరీక్షల ఒత్తిడిని ఎలా అధిగమించాలనే పలువురు విద్యార్థుల ప్రశ్నలకు మోదీ తనదైన రీతిలో సమాధానం ఇచ్చారు. దాంతోపాటు దేశవ్యాప్తంగా త్వరలో జరుగనున్న బోర్డు పరీక్షల్లో రాణించేందుకు చిట్కాలను కూడా ప్రధాని పంచుకున్నారు.  ఖాళీ సమయం విద్యార్థులకు ఓ చక్కటి అవకాశమని, దినచర్యలో కాస్త ఖాళీ సమయం ఉంచుకోవాలని సూచించారు.

లేదంటే రోబో తరహా జీవితం మారిపోయే ఛాన్స్ ఉందన్నారు. అలాగే ఖాళీ సమయాల్లో ఏఏ అంశాలు చేయకూడదన్న విషయంలోనూ విద్యార్థులకు స్పష్టమైన అవగాహన ఉండి తీరాలన్నారు. ఊహా లోకంలో విహరించడాన్ని ఆపేయాలని, అలా విహరించడం బాగానే ఉంటుంది కానీ, ప్రపంచం చాలా చిన్నదని పేర్కొన్నారు.

విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు.. స్వయం ప్రభా యొక్క 32 ఛానెళ్లతోపాటు దూరదర్శన్, వివిధ ప్రభుత్వ వేదికల ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. పరీక్షా పే చర్చ కార్యక్రమంలో దాదాపు 14 లక్షల మంది పాల్గొన్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ వెల్లడించారు.

సృజనాత్మక రచన పోటీలో 10.5 లక్షల మంది విద్యార్థులు, 2.6 లక్షల మంది ఉపాధ్యాయులు, 92,000 మంది తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా 81 దేశాల విద్యార్థులు పాల్గొనడం ఇదే మొదటిసారి.